మూఢనమ్మకాలతో ఓ యువతిని గొలుసులతో కట్టేసిన ఘటన ఝార్ఖండ్ బిష్టుపుర్లో (Bistupur Jharkhand) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల యువతిని ఖార్ఖయి నది ఒడ్డున చైన్లతో (girl found chained) బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి.. యువతిని విడిపించారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా ఆమెను బంధించి ఉంచినట్లు తెలుస్తోంది.
బాధిత యువతి పర్సుదీ ప్రాంతంలో నివాసం ఉంటుందని తెలుస్తోంది. దెయ్యం పట్టిందని (Jharkhand superstitious) యువతి బంధువులు ఆమెను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. పవిత్ర ప్రదేశంగా భావించే ఇక్కడ ఆమెను ఉంచితే నయం అవుతుందన్న నమ్మకంతో యువతిని గొలుసులతో కట్టేశారు.
యువతి మానసిక పరిస్థితి బాగానే ఉందని స్థానిక డీఎస్పీ అనిమేశ్ గుప్తా తెలిపారు. తన పేరు, అడ్రెస్ సరిగ్గా చెబుతోందని వెల్లడించారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.
30 కేజీల గొలుసులతో..
మరోవైపు రాజస్థాన్ ప్రతాప్‌గఢ్ జిల్లా లాల్‌గఢ్ గ్రామ పంచాయతీలో ఇదే తరహా ఘటన జరిగింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. మహిళను 30 కేజీల బరువైన చైన్లతో కట్టేశాడు. ఆమెను ఓ కాలిపోయిన పూరి గుడిసెలో ఉంచేశాడు. మూడు నెలలుగా ఆ మహిళ ఈ నరకం అనుభవించిందని స్థానికులు చెప్పారు. జులై 1న ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది.
మరోవైపు, మధ్యప్రదేశ్‌లో ఓ టీనేజర్ పట్ల తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు. చైన్లతో కట్టేసి తీవ్రంగా కొట్టాడు. తన తండ్రి తనను చదువుకోనివ్వకుండా కూలీ పనికి పంపించేవాడని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆహారం కూడా ఇచ్చేవాడు కాదని వాపోయింది. తండ్రి తీరుపై విసుగు చెంది ఏప్రిల్ 6న చైల్డ్ లైన్ కేంద్రానికి సమాచారం ఇచ్చింది.
ఇదీ చదవండి: చదువుల్లో దిట్ట- జ్యోతిషంపై అపార నమ్మకం!