Gas Borewell: ఎల్పీజీ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ఆ ఇంట్లో వాళ్లు మాత్రం నిశ్చింతగా వంట గ్యాస్‌ను ఉపయోగించుకుంటారు. అసలు బయట మార్కెట్లోని గ్యాస్ ధరలతో వారికి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్లకు కావాల్సిన వంట గ్యాస్ బోరు బావిలోంచి వస్తోంది. అవును నిజమే.. గత తొమ్మిదేళ్లగా వారు ఈ గ్యాస్‌నే వాడుతున్నారు. ఈ వింత కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగింది.
అరుత్తువళి ప్రాంతంలో నివాసం ఉంటున్న రత్నమ్మ కుటుంబం నీటి కొరత భరించలేక బోరు తవ్వించాలని నిశ్చయించింది. 16 మీటర్లు తవ్వినా ఎక్కడా చుక్క నీరు లభించలేదు. అదే సమయంలో పైపు దగ్గర ఉన్న వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించేసరికి భగ్గుమంటూ మంటలు వచ్చాయి. మొదట దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ గ్యాస్ లీక్ కొనసాగడం వల్ల ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు రత్నమ్మ నివాసానికి వచ్చి పరీక్షలు నిర్వహించారు. ఆ వస్తున్న గ్యాస్ మీథేన్ అని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం వల్ల రత్నమ్మ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.
వంటగ్యాస్ గురించి తెలుసుకున్న రత్నమ్మ వెంటనే ప్లంబర్‌ను పిలిచి బోరు నుంచి స్టవ్‌కు పైపులు బిగించింది. అప్పటి నుంచి వీరు ఆ వంట గ్యాస్‌నే వాడుకుంటున్నారు.
మొదట ఈ గ్యాస్ వల్ల పేలుడు జరిగే అవకాశం ఉందని భయపడ్డామని.. కానీ ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదని చెప్పుకొచ్చారు రత్నమ్మ. ఈ ప్రాంతంలో వరదలు వస్తే తప్ప ఈ గ్యాస్‌కు కొరత ఏర్పడదని పేర్కొన్నారు.
ఈ వింత చూసేందుకు చాలా మంది పరిశోధక విద్యార్థులు రత్నమ్మ ఇంటికి వస్తున్నారు. గ్యాస్ నమూనాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి : నెమలి చనిపోయినా దాని వెంటే.. నాలుగేళ్ల బంధాన్ని వీడలేక..