Gang rape in Gujarat: గుజరాత్లోని డాంగ్ జిల్లాలో ఓ 14 ఏళ్ల బాలికపై స్నేహితులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటనకు సంబంధించి.. ఆరుగురిని అరెస్ట్ చేసి, మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోను బాధితురాలి బంధువు చూసి కుటుంబ సభ్యులకు తెలియజేయగా బయటకు వచ్చింది.
" బాధితురాలు.. రెండు నెలల క్రితం పక్క ఊరిలో ఓ వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆమె మైనర్ స్నేహితుడు ముందు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వచ్చే దారిలో ఉన్న బాలుడి 8 మంది స్నేహితులు బాలికను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు 20 ఏళ్లవారు కాగా.. ముగ్గురు మైనర్లు. నిందితుల్లో ఒకడు తన మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత అటుగా వస్తున్న కొందరిని చూసి పారిపోయారు."
- ఎన్హెచ్ సవ్సేత, ఎస్సై.
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని పారిపోయే ముందు బాలికను బెదిరించారని ఎస్సై తెలిపారు. భయపడిపోయిన బాలిక రెండు నెలల వరకు ఎవరికీ చెప్పలేదు. ఇటీవల ఆమె బంధువు ఒకరు ఆ వీడియోను చూసి కుటుంబ సభ్యులకు తెలిపాడని, ఆ తర్వాత వారు పోలీసులను ఆశ్రయించగా డిసెంబర్ 23న ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు.
నిందితులు 9 మందిని డిసెంబర్ 24న అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఎస్సై. ముగ్గురు మైనర్లు వారి సంరక్షకుల హామీతో బెయిల్ పొందారని, మిగిలిన ఆరుగురిని కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376(డీ)(ఏ), 506(2), 120(బీ), 114 సహా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. చెరుకు తోటలో మృతదేహం!