Gaganyan Mission First Test : చంద్రునిపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసి స్పేస్.. ప్రయోగాల్లో దూకుడుగా ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలను లక్షించే కీలక సన్నాహక పరీక్షకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌లోని మొదటి ప్రయోగానికి వినియోగించే ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1...TV-D1 వాహక నౌకను పరీక్షించనుంది. శనివారం ఉదయం 8 గంటలకు ఈ సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది తీసుకెళ్లే క్రూమాడ్యుల్, క్రూఎస్కేప్ సిస్టమ్‌ను 17 కిలోమీటర్ల ఎత్తులో వదిలిపెడుతుంది. అక్కడి నుంచి ఆ క్రూ మాడ్యూల్ సురక్షితంగా పారాచూట్ల సాయంతో.. బంగాళాఖాతంలోకి చేరనుంది. ప్రయోగం 8.5 నిమిషాల్లో పూర్తికానుంది.
వ్యోమనౌక తీసుకెళ్లే క్రూ ఎస్కేప్ సిస్టమ్ బరువు 12.5 టన్నులు కాగా క్రూ మాడ్యూల్ బరువు 4.5 టన్నులు ఉంటుంది. వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూ కక్ష్యలోకి పంపించి 3 రోజుల పాటు అక్కడే ఉంచి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావాలన్నది.. గగన్‌యాన్ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెస్ట్‌ఫ్లైట్ విజయవంతమైతే.. మరిన్ని అర్హత పరీక్షలు, మానవరహిత మిషన్‌లకు మార్గం సుగమమవుతుంది. నిజమైన గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం.. బాహుబలి రాకెట్ LVM 3 రాకెట్‌ను ఇస్రో వినియోగించనుంది..
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శ్రీహరికోట చేరుకుని సంచాలకులతో సమీక్ష చేస్తున్నారు. స్టేజ్ ప్రిపరేషన్ బిల్డింగ్ నుంచి క్రూమాడ్యుల్, క్రూఎస్కేప్ సిస్టమ్‌ను మొదటి ప్రయోగ వేదిక కు తీసుకొచ్చి రాకెట్ తో అనుసంధానం చేశారు. ఈ మేరకు పలు పరీక్షలు నిర్వహించగా.. బుధవారం రిహార్సల్స్ జరిపిన అనంతరం శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. రాకెట్ సన్నద్ధ సమావేశం అనంతరం లాంచ్ ఆథరైజేషన్ సమావేశం నిర్వహించారు. కౌంట్ డౌన్ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మొదలై 14.30 గంటల పాటుగా కొనసాగనుంది.
Aditya L1 Launch : నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్1'.. సూర్యుడిని నిమిషానికోసారి క్లిక్!
Aditya L1 Launch : సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. తొలిసారిగా ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C57 వాహకనౌక ఆదిత్య ఎల్1 ను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్ అనంతరం శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహాన్ని మోసుకుని PSLV-C57 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం పీఎస్‌ఎల్వీ-సీ57 నుంచి విజయవంతంగా ఆదిత్య-ఎల్1 విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. సూర్యుడిపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే కావడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు
Isro Aditya L1 Mission Launch Date : ఆదిత్య ఎల్-1ను తొలుత భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకునేందుకు ఆదిత్య ఎల్ -1కు దాదాపు 125 రోజుల సమయం పట్టనుంది. లగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా కాగా, అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు కొనసాగించే వీలుంది. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు ఈ పాయింట్ ఎంతో ఉపకరిస్తుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఆదిత్య ఎల్ -1 ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సూర్యుడిపై అధ్యయనాలను చేపడుతోంది.