Free Snacks For Voters : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్‌లో చిరు వ్యాపారులు తమ వంతుగా వినూత్న కృషి చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయమే ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఉచితంగా అల్పాహారం అందించాలని నిర్ణయించారు. ఇందౌర్‌లోని '56 దుకాణ్' ప్రాంతంలో ఉన్న దుకాణాల యజమానులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగానే ఓటేసిన వారికి అటుకులు, జిలేబీలతో కూడిన స్నాక్స్‌ను ఉచితంగా ఇస్తామని తెలిపారు.
ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఫ్రీ..
Free Tiffin For Voters : కాగా, ఎన్నికల రోజు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న వారు.. తమ దుకాణాలకు వచ్చి ఉచిత స్నాక్స్ తీసుకోవచ్చని ఇక్కడి వ్యాపారులు తెలిపారు. ఓటర్లు తమ వేలికి అంటించిన సిరా గుర్తును చూపిస్తే సరిపోతుందని చెప్పారు.
"పరిశుభ్రత విషయంలో ఇందౌర్ నగరం దేశంలోనే తొలి స్థానంలో ఉంది. ఓటింగ్ విషయంలోనూ మా నగరం టాప్‌లో ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఇందుకోసమే ఓటు వేసిన వారికి మేం ఉచితంగా అటుకులు, జిలేబీ ఇవ్వాలని నిర్ణయించాం. నవంబర్ 17వ తేదీన ఉదయం 9 గంటల వరకు ఈ ఉచిత ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఓటర్‌కు పోహా, జిలేబీపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తాం. ఈ ఆఫర్ రోజంతా అందుబాటులో ఉంటుంది."
-గుంజన్ శర్మ, 56 దుకాణ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
'56 దుకాణ్' అంటే ఏంటి?
'56 దుకాణ్' అనేది ఇందౌర్‌లోని ఫేమస్ ఫుడ్ హబ్. ఇక్కడ అనేక ఆహార స్టాళ్లు ఉంటాయి. ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. '56 దుకాణ్' ప్రాంతాన్ని పరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్ హబ్‌గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తించింది. ఇక్కడి అవుట్లెట్లు అన్నీ పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్న నేపథ్యంలో ఈ గుర్తింపు ఇచ్చింది.
Madhya Pradesh Election Schedule : 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నవంబర్ 17న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇందౌర్‌లోని పట్టణ ప్రాంతంలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో 14.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 67 శాతం మంది మాత్రమే ఆ ఎన్నికల్లో ఓటేశారు. ప్రస్తుతం ఈ ఐదు నియోజకవర్గాల్లో 15.55 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.