దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ, సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలపై పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిని ప్రశ్నించగా.. ఆయన చెప్పిన సమాధానం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
"పెట్రోల్ అంత ఖరీదైనది కాదు. కేంద్రం, రాష్ట్రాలు దానిపై పన్నులు విధించాయి. మరోపక్క ప్రభుత్వం ప్రజలందరికి కరోనా టీకాలు ఉచితంగా అందిస్తోంది. మీరు చెల్లించకుండాటీకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పన్నుల నుంచే టీకా డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వం 130 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో టీకా డోసు ధర రూ.1,200. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాలి."
-- రామేశ్వర్ తెలి, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి
అలాగే హిమాలయన్ మంచినీళ్లకు పెట్రోల్‌కు పోలిక పెడుతూ మరో వివరణ ఇచ్చారు. 'మీరు హిమాలయన్ మంచినీళ్లు తాగాలంటే ఒక బాటిల్‌కు రూ.100 వెచ్చించాలి. పెట్రోల్ కంటే దాని ధరే ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే, అందుకు తగ్గట్టే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. మా మంత్రిత్వ శాఖ ఈ ధరల్ని నియంత్రించలేదు. అది వాణిజ్య శాఖ పరిధిలోని విషయం'అని అన్నారు.
గత కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సోమవారం లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల వరకు పెరిగింది. దాంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చమురు ధరలు 100 మార్కును దాటడం వల్ల ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.
ఇదీ చదవండి: 'కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాల్సిందే'