Free BUS Travel For Women From December 9 in Telangana : 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన ఖర్చుల వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. కేబినెట్ భేటీ(Telangana Cabinet) అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీ హామీలను అమలు చేయాలని భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు.
Telangana Cabinet Decisions : డిసెంబరు 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు(Free Buss) సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వైద్య సౌకర్యం హామీ అమల్లోకి తెస్తామన్నారని శ్రీధర్ బాబు అన్నారు. కేబినెట్ భేటీలో రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఖర్చులు ఎందుకు చేశారు, ప్రజలకు ఎంత చేరిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
ఈనెల 9 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అదే రోజు 9న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నారు. రాష్ట్రంలో తుపాను వల్ల నష్టపోయిన పంటలను మంత్రులు పరిశీలిస్తారని తెలిపారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తారని, రైతులకు పెట్టుబడి సాయంపై కేబినెట్ భేటీలో చర్చించామన్నారు.
అందుకు సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించామన్నారు. దీనిపై సమాచారం రాగానే హామీల అమలుపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల విషయమై కేబినెట్‌లో చర్చించారని, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
CM Revanth Reddy Review on Electricity Department : తొలి కేబినెట్ సమావేశంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌పై హాట్ హాట్‌గా చర్చ జరిగింది. విద్యుత్ రివ్యూ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం మండిపడ్డారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం(రేపటి)లోగా పూర్తి వివరాలతో రావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎండీ ప్రభాకర్ రావు(CMD Prabhakar rao) రాజీనామాను ఆమోదించొద్దన్నారు. రేపటి రివ్యూకు ప్రభాకర్ రావును రప్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. రేపు ఉదయం విద్యుత్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
కొలువుదీరిన కొత్త ప్రభుత్వం - ముఖ్యమంత్రిగా ఆరు గ్యారంటీల దస్త్రంపై రేవంత్ రెడ్డి తొలి సంతకం