Rajinikanth Foundation : ప్రముఖ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ 'రజనీకాంత్ ఫౌండేషన్' పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న విషయం పోలీసుల దృష్టికి చేరింది. నకిలీ ఖాతాల ద్వారా వేలాది మందిని తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థ ట్రస్టీ శివరామకృష్ణన్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ముంబయి పెనిన్సులా పార్క్ టవర్, బిజినెస్ పార్క్ అడ్రస్‌కు చెందిన ఓ బోగస్ ఫౌండేషన్.. ఇలా చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'రజనీకాంత్ ఫౌండేషన్' విజయవంతమైన సందర్భంగా లక్కీ డ్రా ఎర్పాటు చేశామని.. 2000 మంది రిజిస్టర్ అయితే 200 మందిని ఎంపిక చేసి.. వారికి ఉచితంగా బహుమతులు డోర్ డెలివరీ చేస్తామని మోసం చేస్తున్నట్లు తెలిపారు. దుండగులు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్ ఉపయోగించి.. లక్కీ డ్రాలో విజేతలు ఎవరో తెలుసుకోవచ్చని కాంటాక్ట్ నంబర్లు ఇస్తున్నారని చెప్పారు.
'రజనీకాంత్ ఫౌండేషన్' పేరుతో మోసాలకు పాల్పడుతూ.. ఆ సంస్థతో పాటు రజనీకాంత్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని శివరామకృష్ణన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలు మొబైల్ నంబర్లతో ఆపరేట్ చేస్తూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి దాదాపు రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫౌండేషన్ నుంచి సహాయం అందుతుందని నమ్మి బాధితులు మోసపోయారని తెలిపారు. అయితే, ఇది కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదని.. రజనీకాంత్ ఫౌండేషన్ పేరును, ఇమేజ్ను దుర్వినియోగం చేస్తూ.. కోయంబత్తూర్, బిహార్, తిరువనంతరపురం తదితర ప్రాంతాలలో కూడా మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు.
రజనీకాంత్ ఫౌండేషన్ సమగ్రతను కాపాడటానికి, రజనీకాంత్ ప్రతిష్ఠను నిలబెట్టడానికి.. ఇలాంటి మోసాలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను శివరామకృష్ణన్ కోరారు. ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోందని.. ఇలాంటి మోసగాళ్ల వలలో పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శివరామకృష్ణన్ సూచించారు. రజనీకాంత్ ఫౌండేషన్ నుంచి ఎలాంటి ప్రకటనలు వచ్చినా.. వాటి ప్రామాణికతను క్షుణ్ణంగా ధ్రువీకరించుకోవాలని తెలిపారు.
Rajinikanth Foundation TNPSC : చెన్నైలోని కోడంబాక్కం మెయిన్ రోడ్లో రజనీకాంత్ ఫౌండేషన్ అధికారిక కార్యాలయం ఉంది. దీన్ని న్యాయవాది సత్య కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా టీఎన్పీఎస్సీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచిత పుస్తకాలు, కోచింగ్ అందిస్తున్నారు. తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా, అవసరమైన వారికి, ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారికి విద్య, వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.