కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. బెంగళూరు జిల్లా కార్యాలయం సమీపంలోని న్యూమరాలజీ జోన్లో గత గురువారం జరిగిన దంపతుల హత్య కేసులో 14ఏళ్ల కొడుకే నిందితుడనే అసలు నిజం ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటనలో నిందితుణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఏం జరిగిందంటే.?
యాదగిరి జిల్లాకు చెందిన హనుమంతరాయ(42), హొణ్నమ్మ(34) దంపతులు.. బెంగళూరు కరిహోబనహళ్లి సమీపంలోని న్యూమరాలజీ జోన్లో పని మనిషులుగా చేసేవారు. పక్కనే ఉన్న షెడ్లో నివాసముంటూ.. రాత్రివేళల్లో పని చేసే ప్రాంగణంలోనే నిద్రించేవారు. ఎప్పటిలాగే గురువారం(ఈ నెల 6న) ఉదయం సిబ్బంది కార్యాలయానికి వచ్చారు. తలుపులు తాళం వేసి ఉన్నందున.. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లగా.. ఆ దంపతులు విగతజీవులుగా పడిఉన్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. కన్న కొడుకే ఈ దారుణానికి పాల్పడ్డాడనే అసలు విషయం బయటపడింది.
ఇదీ చదవండి: భౌతిక దూరం పాటించమన్నారని పోలీసులపై దాడి
తండ్రిని నెట్టి, తల్లిపై రాయితో..
వయసొచ్చిన కొడుకు తోటి స్నేహితులతో తిరుగుతూ చెడిపోవడం ఇష్టంలేని తల్లిదండ్రులు.. అతడికి నచ్చజెప్పేందుకు యత్నించారు. ఆగ్రహించిన కుమారుడు ఆవేశానికిలోనై.. నిద్రిస్తున్న సమయంలో తండ్రిపై పెద్ద బండరాయి వేశాడు. అది పొరపాటున తల్లిపై పడింది. ఆమె స్పృహ కోల్పోయింది. ఈ శబ్దం విని తండ్రి లేవగా.. వెంటనే ఆయన్ను బలంగా నెట్టేసి హతమార్చాడు. తల్లి స్పృహలోకి వస్తే అసలు నిజం బయటపడుతుందనే కారణంతో తల్లిని కూడా చంపినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఇదీ చదవండి: చదువుకోవాల్సిన బాలుడు సాక్స్‌ల అమ్మకం- సీఎం సాయం