రాజస్థాన్ రాజధాని జైపుర్ జిల్లాలోని జామ్వా రామ్గఢ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టర్పెంటైన్ ఆయిల్ తయారీ, ప్యాకింగ్ కర్మాగారంలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారణాలపై స్థానికులను ఆరా తీశారు. టర్పెంటైన్ ఆయిల్ తయారీ పరిశ్రమను యజమాని తన ఇంటిలోనే ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు.
" వ్యవసాయ భూమిలో నిర్మించిన హాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. పెయింటింగ్ కోసం ఉపయోగించే రసాయనాలను ప్యాకింగ్ చేసేందుకు ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారు. చిన్నారులు పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు. "
- జామ్వారామ్గఢ్ సీఐ శివకుమార్.
అగ్ని ప్రమాదం కారణంగా రూ.లక్షల విలువైన సామగ్రి దహనమైనట్లు అంచనా వేస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'టీకా తీసుకుంటే నా 8 మంది పిల్లలేంగాను?'.. వీడియో వైరల్