Daughters Carry Mother's Body: 'దేవుడు తాను అన్ని చోట్లా ఉండలేక... అమ్మను సృష్టించాడు' అని అమ్మ గొప్పతనాన్ని కవులు వర్ణించారు. కానీ, నేటి సమాజంలో తల్లి బతికి ఉన్నప్పుడే పట్టించుకోని కొడుకులు కోకల్లలు. ఆఖరికి చనిపోయాక కూడా తమకు ఏ సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మరికొందరు. ఒడిశా పూరీలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. తల్లికి అంత్యక్రియలు నిర్వర్తించేందుకు కుమారులు వెనుకాడారు. దాంతో ఆమె కూతుళ్లే ఆ బాధ్యతను 'భుజాని'కెత్తుకున్నారు.
పూరీలోని మంగళ్ఘాట్ ప్రాంతానికి చెందిన జాతీ నాయక్(80) అనారోగ్యంతో శనివారం కన్నుమూసింది. జాతీ నాయక్‌కు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. తల్లి చనిపోతే.. ఆమె అంత్యక్రియలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు సాధారణంగా కుమారులపైనే ఉంటుంది. కానీ, జాతీ నాయక్ కొడుకులు మాత్రం తమ తల్లికి చివరికర్మలు నిర్వర్తించేందుకు ససేమిరా అన్నారు. ఆస్తి వివాదాల కారణంగానే వారు తమ తల్లి చనిపోతే.. దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఆమె నలుగురు కూతుళ్లే 'ఆ నలుగురి'గా మారారు. సమాజపు కట్టుబాట్లను చెరిపేస్తూ.. తల్లి పాడెను భుజానికెత్తుకున్నారు. 'రామ్ రామ్ సత్యహే' నినాదాల మధ్య... నాలుగు కిలోమీటర్లు దూరం నడిచి తల్లి మృతదేహాన్ని శ్మశానానికి చేర్చారు. అక్కడ ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: ఆర్మీ మాజీ అధికారి దంపతుల్ని సజీవ దహనం చేసిన దుండగులు
ఇదీ చూడండి: 60 మేకలు, వందల కిలోల రైస్‌తో అదిరే విందు- మహిళలకు నో ఎంట్రీ!