Ashwani Kumar: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ మంగళవారం.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్తో తనకున్న 46 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికారు. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ వెలుపలే ఉత్తమంగా సేవ చేయగలనని ఆయన రాజీనామా లేఖలో చెప్పారు.
" ప్రస్తుత పరిస్థితుల్లో నా గౌరవానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాను. జాతీయ ప్రయోజనాల కోసం పార్టీ వెలుపలే ఉత్తమంగా సేవ చేయగలను. పార్టీతో నా 46 సంవత్సరాల అనుబంధానికి ముగింపు పలుకుతున్నాను. స్వాతంత్య్ర సమరయోధులు ఊహించిన ఉదార ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాను."
- రాజీనామా లేఖలో అశ్వనీ కుమార్
2002 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు అశ్వనీ కుమార్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2012 అక్టోబరు 28 నుంచి 2013 మే 10 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.
ఇటీవల సీనియర్ నేత ఆర్‌పీఎన్ సింగ్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈ రాజీనామాకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్యకాలంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్ వంటి సీనియర్ నేతలు కూడా పార్టీని వీడారు.
ఇదీ చదవండి: దాణా స్కామ్ ఐదో కేసులోనూ లాలూ దోషి- త్వరలోనే మళ్లీ జైలుకు..