అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి ఆరోగ్యం విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం గువాహటి వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటిలేషన్ మద్దతుతో చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత విశ్వశర్మ తెలిపారు.
గొగొయి పరిస్థితి తీవ్రంగా ఉందని, రాబోయే 48 నుంచి 72 గంటలు మరింత కీలకమని శర్మ వెల్లడించారు.
కరోనా బారిన పడి..
తరుణ్ గొగొయికి ఆగస్టు 25న కరోనా సోకగా ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 31న ఆయనకు రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయింది. ప్లాస్మా థెరపీ తర్వాత తిరిగి కోలుకున్నారు.
మళ్లీ నవంబర్ 1న ఆరోగ్యం క్షీణించగా.. ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సాయంతో ప్రాణాలతో పోరాడుతున్నారు.
3 సార్లు ముఖ్యమంత్రిగా..
కాంగ్రెస్లో సీనియర్ నేత అయిన గొగొయి.. అసోంకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు కరోనా సోకడానికి కొన్ని రోజుల ముందు అసెంబ్లీ ఎన్నికల కసరత్తుల్లో ఉన్నారు. విపక్షాలను ఏకం చేసి మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు.
ఇదీ చూడండి: అసోంలో అగ్ని ప్రమాదం- పదికి పైగా ఇళ్లు దగ్ధం