విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. చరిత్రలో తొలిసారి ఇందుకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-యూజీసీ. సంబంధిత ముసాయిదా నిబంధనావళిని గురువారం విడుదల చేసింది. అడ్మిషన్ ప్రక్రియ, ఫీజును నిర్ణయించడం సహా ఇక్కడ వచ్చిన నిధుల్ని స్వదేశానికి పంపుకునే అవకాశాన్ని విదేశీ వర్సిటీలకు ఇచ్చింది యూజీసీ.
ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు భారత దేశంలో నేరుగా కార్యకలాపాలు సాగించేందుకు అవకాశం కల్పించాలన్న నూతన విద్యా విధానం-2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్. ఈ నిర్ణయానికి సంబంధించి ఆయన చెప్పిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
- భారత్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసిన విదేశీ వర్సిటీలు ఆఫ్‌లైన్ విధానంలో ఫుల్‌టైమ్ కోర్సులు మాత్రమే అందించాలి. ఆన్లైన్ క్లాసులు, దూర విద్య కోర్సులకు వీలు లేదు.
- భారత దేశ ప్రయోజనాల్ని దెబ్బతీసే కోర్సుల్ని ఈ విదేశీ విశ్వవిద్యాలయాలు అందించరాదు.
- దేశంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలనుకునే విదేశీ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
- తొలుత పదేళ్లు కార్యకలాపాలు సాగించేందుకు అనుమతి లభిస్తుంది. నిర్దేశిత నిబంధనలన్నీ పాటిస్తే 9వ ఏడాదిలో అనుమతులు రెన్యువల్ అవుతాయి.
- విదేశీ వర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు సంబంధించిన తుది నిబంధనావళి ఈ నెలాఖరుకు వెలువడుతుంది.
- అడ్మిషన్ క్రైటీరియా, ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించుకునేందుకు యూనివర్సిటీలకే స్వేచ్ఛ ఉంటుంది. అయితే.. ఫీజు హేతుబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని యూజీసీ సూచిస్తోంది.
- సంస్థ అవసరాలకు తగినట్టుగా భారత్ నుంచి, ఇతర దేశాల నుంచి బోధనా సిబ్బందిని నియమించుకునే అధికారం విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉంటుంది.
- ఇతర దేశాలకు నిధుల బదిలీకి సంబంధించి.. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం-ఫెమా నిబంధనలు లోబడి ఉండాలి.
ఐరోపాలోని అనేక విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆసక్తి చూపించాయని తెలిపారు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్. అయితే ఆయా వర్సిటీల వివరాలను ఆయన వెల్లడించలేదు. క్యాంపస్‌ల ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా నిబంధనావళిపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు, ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలకు లేఖలు రాయనున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: కుంగిపోతున్న జోషీమఠ్.. 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు
అయ్యప్పను దర్శించుకుని ఇంటికి తిరిగొచ్చిన పావురం.. 800కి.మీ దూరాన్ని గుర్తుపెట్టుకొని..