ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah News) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో(2024 Lok Sabha Election) ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయాలంటే.. 2022 యూపీ ఎన్నికల్లో(2022 Up Assembly Election) ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ మళ్లీ ఎన్నిక కావాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో భాజపా సభ్యత్వ విస్తరణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు. అవధ్ ప్రాంతంలోని డిఫెన్స్ ఎక్స్పో మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది.
"ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ.. ఉత్తర్‌ప్రదేశ్‌కు ఏమేం అవసరమో అన్నీ అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి 2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అంకురార్పణ జరుగుతుంది. 2024లో మోదీ మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలంటే... ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ఎన్నిక కావాలి."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
రాబోయే ఎన్నికలను భరత మాతను విశ్వగురువుగా తయారు చేసేందుకు జరిగే ఎన్నికలుగా అమిత్ షా(Amit Shah News) అభివర్ణించారు. దీపావళి తర్వాత పార్టీ ప్రచారం ఊపందుకుంటుందని... దానికోసం కార్యకర్తలంతా అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. భాజపా కార్యకర్తలు తమ జెండాలతో బయటకు అడుగుపెట్టడం చూసి ప్రతిపక్షాలు బెదిరిపోతున్నాయని అన్నారు. 300కు పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
'అఖిలేశ్ సమాధానం చెప్పాలి'
ఎన్నికల నగారా మోగగానే.. ఇంట్లో కూర్చున్న నేతలు కొత్త చొక్కాలు వేసుకుని బయటకు వస్తున్నారని ప్రతిపక్ష నేతలపై వ్యంగ్యస్త్రాలు అమిత్ షా(Amit Shah News) విమర్శించారు. "నేను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను అడుగుతున్నాను. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్ని రోజుల విదేశాల్లో ఉన్నారో యూపీ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి" అని షా ప్రశ్నించారు.
"వారి కోసం, వారి కుటుంబాల కోసమే పరిపాలన చేశారు. వారికి ఇంకా ఏమైనా విస్తృతమైన ఆలోచన ఉంటే.. అది వారి సామాజిక వర్గం కోసం తప్పిస్తే.. ఇంకా ఎవరి కోసం కాదు" అని ప్రతిపక్షాలను అమిత్ షా విమర్శించారు. అయోధ్యలో రామందిర నిర్మాణానికి తామే పునాది వేశామని చెప్పారు. ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
'మోదీ.. 24 క్యారెట్ల బంగారం'
ప్రధాని మోదీ 24 క్యారెట్ల బంగారం అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాధినేతగా మోదీ ప్రస్థానాన్ని.. మేనేజ్మెంట్ పాఠశాలల్లో సమర్థమైన నాయకత్వం, సమర్థమైన పాలన అనే అంశాలపై కేస్ స్టడీగా బోధించాలని అన్నారు. మోదీపై చిన్న అవినీతి మచ్చ కూడా లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతగా మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడారు.
ఇదీ చూడండి: పీఎం రేసుపై అన్నీ ఇప్పుడే చెబితే ఎలా?: దీదీ
ఇదీ చూడండి: యూపీ ప్రజలకు ప్రియాంక మరో వరం.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే...