కేంద్ర మంత్రివర్గంలోకి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రులు ఎన్నికవడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధాని చేయని విధంగా మొదటిసారిగా మోదీ ప్రభుత్వం చేసిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు భాజపా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారనడానికే ఇదే నిదర్శమని పేర్కొన్నారు. అసోం పర్యటనలో ఉన్న షా.. ఈ రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా బలోపేతం అవుతోందని షా అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని అందరూ ఆమోదిస్తున్నారని పేర్కొన్నారు. అసోం ప్రజలు.. ఉగ్రవాదం, అల్లర్లకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా కదులుతున్నారన్న షా.. రాష్ట్రంలో రెండోసారి భాజపా అధికారంలోకి రావడమే అందుకు నిదర్శమని పేర్కొన్నారు.
గత ఐదేళ్లుగా సర్బానందా సోనోవాల్, హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం అభివృద్ధివైపు అడుగులు వేసి ప్రజల మెప్పును పొందిందన్నారు షా. అందువల్ల హిమంత్ను కొత్త సీఎంగా అవకాశమిచ్చినట్టు వ్యాఖ్యానించారు. అసోం అధికార యాంత్రాంగానికి అభినందనలు తెలిపారు షా.
రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రసిద్ధ కామఖ్య ఆలయాన్ని దర్శించారు అమిత్ షా. దేశం త్వరితగతిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ కూడా షా వెంటే ఉన్నారు.
ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ
అంతకుముందు అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు, కొవిడ్ కేసుల నియంత్రణ అంశాలపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం షిల్లాంగ్‌లో సమావేశమయ్యారు. అసోం , మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, సిక్కిం రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న సరిహద్దు వివాదాల గురించి ఈ సందర్భంగా అమిత్ షా తెలుసుకున్నారు. గత కొన్నేళ్లుగా అసోం, మిజోరం సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతుండటంపై ఆరా తీశారు.
సరిహద్దు వివాదాల పరిష్కారానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉందని, సంబంధీకులందరి భాగస్వామ్యం, సమష్టి ప్రయత్నాలతో వచ్చే కొన్నేళ్లలోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈశాన్య భారతంలో ప్రశాంతత నెలకొల్పి, జీడీపీలో ఈ ప్రాంత వాటాను 20 శాతానికి పైగా పెంచడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా షిల్లాంగ్‌లో కేంద్ర ఆర్థిక సహకారంతో నిర్మించిన అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే మేఘాలయలో ఇన్నర్ లైన్ పర్మిట్ కోసం గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న పౌర సంఘాలతో పాటు ఖాసి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరచాలని కోరుతున్న సంఘాలతోనూ షా సమావేశమయ్యారు. ఆదివారం సోహ్రా (చిరపుంజి)లో ఆయన పర్యటించనున్నారు.
ఇదీ చూడండి: పాక్ నుంచి సిద్ధూకు శుభాకాంక్షలు