ఛత్తీస్‌గఢ్ బీజాపుర్‌లో ఓ గర్భిణీ నదీ తీరంలోనే ప్రసవించింది. పురిటినొప్పులతో ఇబ్బందిపడుతున్న ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ వర్షాల కారణంగా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. ఓ డోలీలో మహిళను మోసుకెళ్లారు. ఝార్గోయా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే, దారిలో నది అడ్డుగా ఉండటం వల్ల.. మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లడం కుదరలేదు. సమాచారం అందుకొని స్థానిక హోంగార్డులు సహాయానికి వచ్చారు. అయితే, వర్షాల వల్ల నదీప్రవాహం అత్యంత ప్రమాదకరంగా మారింది. అప్పుడే గర్భిణీకి నొప్పులు అధికం అయ్యాయి. దీంతో మహిళ నదీతీరంలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
బీజాపుర్ జిల్లాలో గతకొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని... అనేక లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయని అధికారులు తెలిపారు. దీంతో అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. కాగా, బీజాపుర్ తహసీల్దార్, జనపద్ పంచాయతీ సీఈఓ గర్భిణీ గురించి సమాచారం అందుకొని సహాయక చర్యలకు ఆదేశించారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. మహిళ వద్దకు చేరుకున్నాయి. మోటార్ పడవలో మహిళను నది దాటించాయి. దీంతో ఆమెను ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం తల్లీబిడ్డా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: