Tihar jail prisoners: దిల్లీలోని తిహాడ్ జైలులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జైలు నంబర్ 3లోని ఒకటో నంబర్ వార్డులో ఉన్న ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. పుదునైన ఆయుధాలతో తమను తాము తీవ్రంగా గాయపరుచుకున్నారు. జైలు సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించడం వల్ల వీరెవరూ ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డ ఐదుగురిని హుటాహుటిన జైలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఓ ఖైదీని మాత్రం దీన్‌దయాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే ఖైదీలు ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించారో తెలియదని అధికారులు తెలిపారు. జైలు గదిలోనే వారంతా స్వయంగా గాయపరుచుకున్నారని చెప్పారు. ఓ ఖైదీ ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా.. ఇతర ఖైదీల కేకలు విని అక్కడకు వెళ్లినట్లు వివరించారు. ఆస్పత్రిలో ఉన్న ఖైదీలు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. జనవరి 3న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఫోన్ మింగిన ఖైదీ..
తిహాడ్ జైల్లోనే బుధవారం మరో విచిత్ర ఘటన జరిగింది. ఓ ఖైదీ మొబైల్ ఫోన్‌ను మింగేసినట్లు సిబ్బంది తెలిపారు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షిస్తున్నారు. అయితే అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, మొబైల్ ఇంకా అతని కడుపులోనే ఉందని పోలీసులు చెప్పారు. ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీయాల్సి ఉందన్నారు.
జైలులో ఖైదీలు ఎవరైనా ఫోన్ వినియోగిస్తున్నారా? అని తనిఖీలు నిర్వహిస్తుండగా.. సిబ్బందిని చూసి అతడు మొబైల్‌ను మింగేసినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ పరిమాణం చిన్నదే అని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దేశంలో కరోనా విలయ తాండవం .. ఒక్కరోజే 90,928 కేసులు