ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై న్యాయసమీక్ష విషయంలో ఉన్న లక్ష్మణ రేఖ గురించి తమకు అవగాహన ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2016లో కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని పరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పై వ్యాఖ్యలు చేసింది. నోట్ల రద్దు సమస్య 'అప్రస్తుతం'గా మారిందా లేదా అన్న అంశంపై తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. నోట్ల రద్దు పిటిషన్లపై స్పందనగా సమగ్ర అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది.
"రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఏదైనా సమస్య వస్తే.. దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇరుపక్షాలు అంగీకారానికి రావడం లేదు కాబట్టి.. ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ సమస్య 'అప్రస్తుతం'గా మారిందా, న్యాయసమీక్ష పరిధిలో లేదా అనే అంశాలను సమీక్షించాలి. మాకు లక్ష్మణ రేఖ ఎక్కడ ఉంటుందో తెలుసు. కానీ, ఇది ఎలా చేశారనే విషయాన్ని పరిశీలించాలి. న్యాయవాదుల వాదనలు వినాలి" అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.
'అప్రస్తుత' సమస్యలపై కోర్టు సమయాన్ని వృథా చేయరాదని అన్నారు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. మెహతా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పిటిషనర్ వివేక్ నారాయణ్ శర్మ తరపు సీనియర్ న్యాయవాది ఈ కేసులను రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచాలని పేర్కొన్నారు. "ధర్మాసన సమయం వృథా" అనే పదాలు తనను ఆశ్చర్యపరిచాయని సీనియర్ న్యాయవాది వాదించారు. సీనియర్ న్యాయవాది పి చిదంబరం మాట్లాడుతూ.. "ఈ సమస్య అకడమిక్‌గా మారలేదని, ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాలని అన్నారు.
ఇదీ చదవండి: 'ఆమె' పేరుతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులే కూలీలుగా మారి..