మహారాష్ట్రలో మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కాయి. స్థానికంగా ఘోల్ అని పిలిచే ఈ చేపల(ghol fish)తో కోటి పాతిక లక్షలను సంపాదించారు మత్స్యకారులు.
ఆగస్టు 28న చేపలు పట్టేందుకు చంద్రకాంత్ తారే, అతని బృందం బోట్లలో బయల్దేరింది. దహాను-వాధ్వన్ తీరానికి 20-25 నాటికన్ మైళ్ల దూరానికి చేరుకోగానే.. వారి వలలో కొన్ని చేపలు చిక్కాయి. అంతే, వాటిని బయటకు తీసి చూస్తే.. మెరిసిపోతున్న ఘోల్ చేపలు కనిపించాయి. ఇక వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మొత్తం 157 ఘోల్ చేపలు వారి వలలో పడ్డాయి.
కోట్లకు వేలం
తాము పట్టిన చేపల వీడియోను తీరంలో ఉన్న వారికి పంపగా.. అవి వెంటనే వైరల్ అయ్యాయి. మత్స్యకారులు సముద్రం నుంచి బయటకు వచ్చే సరికి.. వాటి చూసేందుకు వందల మంది బారులు తీరారు. సోమవారం వేలం నిర్వహించగా.. చేపల అంతర్గత అవయవాలు రూ.1.25 కోట్లు పలికాయి.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చేపల్లో ఇవీ ఒకటి. ఈ చేప లోపలి భాగాలను ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో 60 మంది యువత మిస్సింగ్.. తాలిబన్లతో కలిశారా?