Omicron XE in India: కరోనా వైరస్ ఒమిక్రాన్ రకం కన్నా 10శాతం వేగంగా వ్యాపించగల సరికొత్త వేరియంట్ భారత్‌లోనూ వెలుగుచూసింది. 'ఒమిక్రాన్ ఎక్స్‌ఈ' రకం కరోనా వైరస్‌ను ముంబయిలో గుర్తించినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. మొత్తం 376 సాంపిల్స్కు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. ఒకరిలో ఎక్స్‌ఈ, మరొకరిలో కప్పా వేరియంట్ గుర్తించినట్లు వివరించారు. ఈ కొత్త వేరియంట్లు సోకిన రోగుల పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేశారు. ముంబయిలో తాము పరీక్షించిన 230 సాంపిల్స్‌లో.. 228 కేసుల్లో ఒమిక్రాన్‌గా తేలిందని ఆ అధికారి చెప్పారు.
భారత్‌లో కొంతకాలంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 రకాల కలయికతో 'ఒమిక్రాన్ ఎక్స్‌ఈ' వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీఏ.2 రకంతో పోల్చితే ఒమిక్రాన్ ఎక్స్‌ఈ వేరియంట్ 9.8శాతం అధికంగా వ్యాప్తి చెందే అవకాశముందని అంచనా వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల ఇదే విషయం చెప్పింది.
అది కాదేమో..: ముంబయిలోని సాంపిల్ ఎక్స్‌ఈ వేరియంట్‌కు చెందినదిగా ప్రస్తుత ఆధారాలు సూచించడంలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎక్స్‌ఈ వేరియంట్‌గా భావిస్తున్న సాంపిల్ ఫాస్ట్ క్యూ ఫైల్స్.. ఇన్‌సాకాగ్‌కు చెందిన జన్యు నిపుణులు క్షుణ్నంగా పరిశీలించినట్లు. ఆ సాంపిల్ జన్యుక్రమం ఎక్స్‌ఈ వేరియంట్ జన్యుచిత్రంతో సరిపోలడం లేదని ఆయా వర్గాలు వివరించాయి.