ఉద్యోగంలో నుంచి తీసేశారన్న ఆవేదనతో ఓ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ పాఠశాల ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటోలో కూర్చొని తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది.
శ్రీకుమార్ అనే వ్యక్తి చెంబక పాఠశాలలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొవిడ్ సమయంలో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది పాఠశాల యాజమాన్యం. అయితే పాఠశాల పునఃప్రారంభం కాగానే శ్రీకుమార్ యథావిధిగా ఉద్యోగానికి వచ్చాడు. కానీ అతడిని పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురై.. ఆటోలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఆయన మరణించాడు. ఆటో సైతం పూర్తిగా కాలిపోయింది.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్, పోలీసులకు లేఖలు రాశాడు శ్రీకుమార్. వాటిని పాఠశాలలో పనిచేసే తోటి ఉద్యోగులకు అప్పగించాడు.
'పాఠశాల నిర్ణయం వల్లే'
ఈ ఘటనకు యాజమాన్యమే కారణమని పాఠశాల మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో మొత్తం 86 మందిని విధుల్లో నుంచి తొలగించారని చెప్పారు. ఈ స్థానాల్లో కొత్తవారిని తీసుకుంటున్నారని తెలిపారు. వీరి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు.
శ్రీకుమార్ ఆత్మహత్య నేపథ్యంలో మాజీ ఉద్యోగులంతా పాఠశాల ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఇదీ చదవండి: 96 మందికి కొత్త రకం కరోనా