దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని దేహ్రాదూన్ వెళ్తుండగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. కాన్స్రో సమీపంలోని రాజాజీ టైగర్ రిజర్వ్ వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా సీ-5 బోగీలో అగ్నిప్రమాదం సంభవించింది. బోగీ నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో బోగీ పూర్తిగా కాలిపోయింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటల్లో కాలిపోతున్న బోగీని ఇంజిన్ నుంచి సాంకేతిక సిబ్బంది వేరు చేశారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే సీ-5 బోగీలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో బోగీలో మొత్తం 35మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. సీ-5 బోగీలోని ప్రయాణికులను ఇతర బోగీల్లోకి పంపినట్లు వివరించారు. అన్ని సాంకేతిక పరీక్షల అనంతరం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తిరిగి తన గమ్య స్థానానికి బయలుదేరిన్నట్లు తెలిపారు. సకాలంలో రైల్వే సిబ్బంది స్పందించటంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.