ముంబయిలోని ఓ కొవిడ్ కేర్ ఆసుపత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది కొవిడ్ రోగులు చనిపోయారు. భాండుప్ ప్రాంతంలో ఓ మాల్లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన సన్‌రైజ్ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
ఈ ఆసుపత్రిలో ఉన్న 76 మంది రోగులను ఇతర ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించారు.
ఇద్దరు మాత్రమే..
అయితే.. అగ్నిప్రమాదం వల్ల ఆసుపత్రిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్‌తో మృతిచెందిన ఇద్దరిని అగ్నిప్రమాదం అనంతరం బయటకు తీసుకువచ్చినట్లు తెలిపాయి. అన్ని నిబంధనల ప్రకారమే ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి.