Fire Accident in RangaReddy District : రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం బూర్గుల శివారులోని శ్రీనాథ్ రోటో ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో.. డైపర్స్, పెయింట్స్ తయారీతోపాటు పలు రకాల విభాగాలున్నాయి. పెయింట్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు.. ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే రంగులు తయారు చేసే యంత్రం ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న 14 మందికి నిప్పంటుకోవడంతో వారి శరీరాలు కాలిపోయాయి. బాధితులంతా 30ఏళ్లలోపు వారే.
గాయపడినవారిని తోటి కార్మికులు.. చికిత్స కోసం షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల హాహాకారాలతో పరిసర ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు.. 14 మంది క్షతగాత్రుల్లో.. 11 మంది శరీరాలు 50 శాతం కంటే ఎక్కువగా కాలిపోయాయని తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి బాధితులను డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు స్వల్ప గాయాలైన ముగ్గురిని డిశ్చార్జ్ చేశారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది.
Fire Accident in Shadnagar : రంగుల తయారీ యంత్రం పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కార్మికులు కొంత వరకు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మిగిలిన మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు .. పరిశ్రమపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో 80 మందికి పైగా కార్మికులు.. ఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులు మంజు దాస్, ప్రదేపన్, శరత్, గిరధర్ సింగ్, రాహుల్ సునీల్, జేజే పాత్రు, పురాన్ సింగ్, మిర్లాల్ మందారి, రాజులు అని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారంతా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడకు బతుకుదెరువు కోసం వచ్చినవారే. పని చేస్తున్న పరిశ్రమ పరిసరాల్లోని గ్రామాలలో వీరంతా నివాసం ఉంటున్నట్లు సమాచారం.
"శ్రీనాధ్ రోటో ప్యాక్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వీరికి ప్రథమ చికిత్స అందించాం. ఇందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రిఫర్ చేశాం." - ప్రభుత్వ వైద్యుడు, షాద్‌నగర్
Fire accident Secunderabad : సికింద్రాబాద్ లాడ్జిలో అగ్నిప్రమాదం