సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా ఇటీవల చేసిన బెదిరింపుల వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరింది. సమగ్ర దర్యాప్తు చేపట్టి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర మంత్రి సంబురాజే దేశాయ్.
భద్రతకు హామీ..
పూనావాలా భారత్‌కు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. పూనావాలాకు భద్రతకు తమ పార్టీ బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు.
" ప్రజల ప్రాణాలు ముఖ్యం. వ్యాక్సిన్ ఉత్పత్తి భారత్‌లోనే జరగాలి. ఇది దృష్టిలో పెట్టుకుని పూనావాలా భారత్‌కు తిరిగిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనకు ఇప్పటికే కేంద్రం వై ప్లస్ భద్రతను ఇస్తోంది. అవసరమైతే భద్రతను పటిష్ఠం చేసేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది."
- నానా పటోలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు
ఆయనే కారణం..
పూనావాలా వైఖరే అతడిని చిక్కుల్లో పడేలా చేసిందని ఆరోపించారు ఎన్సీపీ నేత, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్. ' వ్యాక్సిన్ (ఒక డోసు) కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.700లగా ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రాలకు రూ.100 తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య ప్రజల్లో పలు ప్రశ్నలు, అనుమానాలకు దారి తీసింది.' అని పేర్కొన్నారు.
యూకేలోనే పూనావాలా..
భారత్‌లో బెదిరింపుల వస్తున్నాయన్న కారణంగా పూనావాల కుటుంబం యూకేకు వెళ్లింది. అయితే.. త్వరలోనే భారత్‌కు తిరిగివస్తానని తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి తనపై పలువురు బెదిరింపులకు పాల్పడ్డారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇదీ చదవండి : ఆక్సిజన్ సమస్యకు 'నానో మాస్క్'తో చెక్!