ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫాంలలో ప్రసారమయ్యే వీడియోలపై పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 'తాండవ్' వెబ్‌సిరీస్‌కు సంబంధించిన విచారణలో భాగంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. "ప్రస్తుతం ఇంటర్నెట్, ఓటీటీల్లో సినిమాలు, వీడియోలు చూడటం చాలా సాధారణమైపోయింది. కాబట్టి దీనిపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని ప్లాట్‌ఫాంలలో అసభ్యకరమైన కంటెంట్ ప్రసారమవుతోంది" అని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న 'తాండవ్' వెబ్‌సిరీస్‌కు సంబంధించిన కేసులో అమెజాన్ ఇండియా అధినేత అపర్ణా పురోహిత్ ముందస్తు బెయిల్‌ను అలహాబాద్ కోర్టు కొట్టేయడం వల్ల ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ప్రకటించిన ఓటీటీల మార్గదర్శకాలను శుక్రవారం కోర్టుకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించారు.
మార్గదర్శకాలకు ఓకే..
ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలను ఓటీటీ వేదికలు ఆహ్వానించాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఓటీటీ వేదికల ప్రతినిధులతో గురువారం చర్చించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించే ఉద్దేశంతో ఓటీటీ వేదికలు సమాచార మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కానున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:భాజపా సీఈసీ భేటీ- పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటున్న నేతలు