తమ జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని కాంక్షిస్తూ ప్రజలంతా దీపావళి పండగ ఘనంగా జరుపుకున్నారు. అయితే.. కొందరి జీవితాల్లో మత్రం అదే పండగ పూట విషాదం అలముకొంది. బైక్‌పై బాణసంచా తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు మంటల చెలరేగాయి. దీంతో ఏడేళ్ల బాలుడు సహా అతని తండ్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.
అసలేమైందంటే...?
పుదుచ్చేరిలోని అరియాన్కుప్పమ్ ప్రాంతానికి చెందిన కాలైనేశన్(32).. తమిళనాడు మరక్కనమ్లో బాణసంచా కొనుగోలు చేశాడు. వాటిని రెండు సంచుల్లో నింపుకొని గురువారం తన ఏడేళ్ల కుమారుడితో కలిసి బైక్‌పై తిరిగి అరియాన్కుప్పమ్కు బయల్దేరాడు. ఈ క్రమంలో తమిళనాడు విల్లుపురం జిల్లా కొట్టాకుపురం వద్ద మంటలు చెలరేగి టపాసులు పేలాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
అదే దారిలో వెళ్తున్న మరో ఇద్దరికీ కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనతో రహదారిపై రెండు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ లారీ సహా ఇతర వాహనాలు ప్రమాదంలో దెబ్బతిన్నాయి. విల్లుపురం, పుదుచ్చేరి అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాలైనేశన్ కొనుగోలు చేసిన బాణసంచాను పరిశీలిస్తున్నారు.
బాణసంచా ఘర్షణ
హరియాణా సోనిపత్ జిల్లాలో దారుణం జరిగింది. బాణసంచా కాల్చడం వల్ల చెలరేగిన ఘర్షణ ఇద్దరు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది.
సైనిపుర ప్రాంతానికి చెందిన శ్యామ్ సింగ్‌కు ముగ్గురు కుమారులు. దీపావళిని పురస్కరించుకుని బుధవారం రాత్రి శ్యామ్ సింగ్ కుమారుడు సచిన్... తమ ఇంటిబయట వీధిలో బాణసంచాను కాల్చాడు. ఈ క్రమంలో పొరుగింటి వ్యక్తి మోహిత్ అలియాస్ లిమా, తన సోదరుడు మనీశ్‌తో కలిసి వచ్చి.. శ్యామ్సింగ్ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఆపై ఆగ్రహానికి గురైన అతడు... శ్యామ్ సింగ్‌తో పాటు అతని కుమారులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనలో శ్యామ్ సింగ్ కుమారుడు గౌరవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు శ్యామ్ సింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సచిన్‌కు, మోహిత్‌కు మధ్య నెల రోజుల నుంచి వివాదం కొనసాగుతోందని పోలీసులకు శ్యామ్ సింగ్ తెలిపాడు. పాత కక్షలతోనే మోహిత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఒడిశాలో ఇద్దరు మృతి
ఒడిశాలో దీపావళి టపాసులు పేలడం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. డేంకానల్ జిల్లాలో బాణసంచా బ్యాగును పట్టుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
కేంద్రపడా జిల్లాలో మరో విషాద ఘటన జరిగింది. జుదాస్పుర్ గ్రామంలో ఓ వ్యక్తి తన ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా.. పేలుడు సంభవించింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఓ వినియోగదారుడికి కూడా గాయాలయ్యాయి.
ఇదీ చూడండి: రాముడికి ముస్లిం మహిళ హారతి.. 15 ఏళ్ల సంప్రదాయం కొనసాగిస్తూ...