కరోనా వ్యాప్తి వేళ నిబంధనలు ఉల్లంఘించి వివాహం చేశారని పెళ్లి కూతురు తండ్రికి రూ. లక్ష జరిమానా విధించారు అధికారులు. చాలానా నగదు జమ చేయాలని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. దీంతో చేసేది ఏమీ లేక తన పొలాన్ని తాకట్టు పెట్టి జరిమానా సొమ్మును చెల్లించాడు. కానీ అనారోగ్యంతో, తీవ్ర మనస్తాపంతో అతను మరుసటి రోజునే చనిపోయాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్ కాప్రేన్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.
![died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11852603_lloioi.jpg)
ఆదిలా గ్రామానికి చెందిన అక్షజిత్, బ్రిజ్మోహన్ మీనా దంపతులు తమ కూతురికి మే14న వివాహం జరిపించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్థాన్‌లో మే30 వరకు లాక్డౌన్ విధించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వివాహాలను జరిపించుకోవచ్చని పేర్కొన్నారు.
![challan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11852603_thu.jpg)
పెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని గ్రామ ప్రజలు గుమికూడారు. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి జరిపిస్తున్నావంటూ పెళ్లికూతురు తండ్రికి అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. అందుకు అధికారులు వచ్చాక గుమికూడిన వారిని వీడియో తీసి ఇదే అందుకు సాక్ష్యం అని చెప్పారు.
![Wife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11852603_yyyyyy.jpg)
తన వద్ద అంత డబ్బులేదని చెప్పినా వినలేదు. మాటిమాటికి డబ్బులు చెల్లించాలని అక్షజిత్ను వేధించారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న తను వైద్యం చేయించుకోకుండా పొలాన్ని తాకట్టు పెట్టి జరిమానా మే17న చెల్లించాడు. తీవ్ర మనస్తాపంతో మే20న చనిపోయాడు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు మృతుని భార్య ఫిర్యాదు చేసింది. లాక్డౌన్ నిబంధలకు అనుగుణంగా పెళ్లి జరిపించామని అయినా తమకు జరిమానా విధించారని తెలిపింది. అధికారులు వస్తే ఏ ఊరిలోనైనా గుమికూడతారని తెలిపింది. అధికారులు వచ్చినప్పుడు జనం గమికూడిన వీడియో తీసి తమను బెదిరించారని ఫిర్యాదు చేసింది. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది.
ఇదీ చదవండి: కొండ ప్రాంతాల్లో బైక్ రైడింగ్‌తో అంతర్జాతీయ గుర్తింపు