Father Carried Son Dead Body On Bike : అంబులెన్స్ లేక ఏడాదిన్నర కుమారుడి మృతదేహంతో 70 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ జరిగింది.. వికాస్ఖండ్ మండలంలోని అడ్సేనా గ్రామంలో దారస్ రామ్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య, ఏడాదిన్నర కుమారుడితో నివసిస్తున్నాడు. రామ్ యాదవ్ భార్య కుమారుడ్ని తీసుకుని తమ పొలానికి వెళ్లింది. ఆమె వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన కుమారుడు కనిపించడం లేదని గ్రహించిన బాలుడి తల్లి, అక్కడున్న వారు.. చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. చెరువులో నుంచి బాలుడ్ని అపస్మారక స్థితిలో బయటకు తీసి.. హూటాహుటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షల అనంతరం చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చిన్నారికి పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించాలని వైద్యులు చెప్పారు.
అయితే మృతదేహానికి పోస్టుమార్టం చేయాలంటే 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. దీంతో తన కుమారుడి మృదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేయాలని రామ్ యాదవ్ వైద్యులను కోరాడు. అయితే తమ వద్ద అంబులెన్స్ లేదని వైద్యులు తెలిపారు. సొంత ఏర్పాట్లు చేసుకుని ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక బైక్‌పై తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు రామ్ యాదవ్. అనంతరం తన స్నేహితుడి సహాయంతో కుమారుడి మృదేహాన్ని కవర్లో చుట్టి బైక్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయం జిల్లా వైద్యాధికారి ఎస్ఎన్ కేసరి దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై స్పందించిన వైద్యాధికారి.. విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసకుంటామని చెప్పారు.
ఇటీవల ఇలాంటి ఘటన ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల్లో జరిగింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవటం వల్ల శవపంచనామా చేసిన మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై ఇంటికి తరలించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. స్థానిక ప్రజలను కంటతడి పెట్టించింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.