రైతుల హోలీ వేడుకలు- సాగు చట్టాల ప్రతులు దహనం! - రైతన్నల ఆందోళనలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. హోలీ సందర్భంగా.. వేడుకలు నిర్వహించారు. మరోవైపు.. షాజహన్పుర్ ఖేడా సరిహద్దులో హోలీ వేడుకలు జరుపుకోవద్దని అక్కడి రైతులు నిర్ణయించారు. సాగు చట్టాల ప్రతులను దహనం చేశారు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులు.. దిల్లీ సరిహద్దు ప్రాంతమైన గాజీపుర్లో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు పాటలు పాడుతూ, డ్రమ్స్ వాయించారు. దానికి అనుగుణంగా మరికొందరు నృత్యం చేశారు. ప్రజల్లో మమేకం అయ్యేందుకే ఇలా చేశామని అన్నదాతలు అన్నారు. హోలీ పండుగ వేళ.. తమ కుటుంబాలకు దూరంగా ఉండటం బాధిస్తోందన్న రైతులు.. మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం కొంతమేర సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ఇదీ చదవండి: ప్రజలకు మోదీ సహా ప్రముఖుల హోలీ శుభాకాంక్షలు
ఈ వేడుకలకు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్, ఆయన సతీమణి సునీతా దేవి హాజరయ్యారు. అన్ని గుడారాల వద్దకు వెళ్లి రైతులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.
"నేడు గాజీపుర్ సరిహద్దులో రైతులు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇదొక సందేశం. దీపావళి తర్వాత శీతాకాలం నాటికైనా ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కరిస్తుందని భావిస్తున్నాం."
- రాకేశ్ టికాయిత్, బీకేయూ నాయకుడు
వారిని స్మరించుకునేందుకే..
నిరసనల సమయంలో అమరులైన 300మంది రైతులను స్మరించుకునేందుకే హోలీ జరుపుకుంటున్నట్టు కర్షకులు పేర్కొన్నారు. 'కుటుంబాలకు దూరమైనా.. ఇదే స్ఫూర్తితో మా పోరాటం కొనసాగిస్తాం. సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గం' అని చెప్పారు.
ఇదీ చదవండి: కరోనాను లెక్కచేయకుండా హోలీ వేడుకలు
అక్కడ హోలీ వేడుకల్లేవ్..
షాజహన్పుర్ ఖేడా సరిహద్దులోని అన్నదాతలు హోలీ సంబరాలకు దూరంగా ఉన్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. పొలాల్లోని మట్టిని తీసుకుని ఒకరికొకరు పూసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. కొత్త వ్యవసాయ చట్టాల ప్రతులను తగలబెట్టారు. కేంద్రం ఇప్పటికైనా దిగొచ్చి.. చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 123వ రోజుకు చేరాయి.
ఇదీ చూడండి: 'సైకత' హోలీ.. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి!