దిల్లీ హింసలో ఐటీఓ వద్ద ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టి.. అందులోని రైతు మృతిచెందిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నవ్రీత్గా గుర్తించారు. విదేశాల్లో పెళ్లి చేసుకుని.. వేడుకల కోసం భారత్‌కు వచ్చిన అతడు.. ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.
మామ ఒత్తిడితో..
27ఏళ్ల నవ్రీత్ సింగ్.. కొన్ని రోజుల ముందే ఆస్ట్రేలియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొంత ఊరు రామ్‌పుర్‌కు వచ్చాడు. ఇటీవలే ఆస్ట్రేలియాలోనే పెళ్లి చేసుకున్న అతడు.. బుధవారం బంధువులు, స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఇంతలో దిల్లీలో మంగళవారం జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనేందుకు తనతో పాటు రావాలని నవ్రీత్ మామ.. అతడ్ని బలవంతం చేశాడు. అందుకు అంగీకరించి దిల్లీ వెళ్లిన నవ్రీత్.. ఇంటికి శవమై తిరిగివచ్చాడు.
ఇదీ చూడండి:- దిల్లీ హింసపై షా వరుస సమీక్షలు
నిరసనల్లో పాల్గొన్న నవ్రీత్.. ట్రాక్టర్ మీద అతివేగంతో ఐటీఓ వైపు దూసుకెళ్లాడు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. దీంతో క్షణాల్లోనే ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అందులో ఉన్న నవ్రీత్ తీవ్రగాయాలతో మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.
మంగళవారం రాత్రి నవ్రీత్ మృతదేహం రామ్‌పుర్‌కు చేరుకుంది. ఆ తర్వాత డిబ్దిబా గ్రామానికి అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించారు.
వేడుకలు జరగాల్సిన నవ్రీత్ నివాసం.. ఇప్పుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అతడి మృతికి సంఘీభావం తెలిపేందుకు పరిసర ప్రాంత ప్రజలు నవ్రీత్ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు తరలివెళ్లారు.
కాల్పులు జరపలేదు..
అయితే పోలీసుల కాల్పుల్లోనే నవ్రీత్ మృతిచెందాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. తాము అతడిపై కాల్పులు జరపలేదని, వీడియోలోనూ ఆనవాళ్లు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- దిల్లీ హింసాత్మక ఘటనలపై సుప్రీంలో వ్యాజ్యం