సాగునీటి కోసం కర్ణాటకకు చెందిన ఓ రైతు భగీరథ ప్రయత్నమే చేశాడు. భూగర్భ నీటిని వెలికితీసేందుకు ఏకంగా 151 బోర్లు వేశాడు. ఎట్టకేలకు చివరి ప్రయత్నంలో సఫలమయ్యాడు.
కొప్పల్ జిల్లాలోని కుటగనహళ్లిలో నివాసం ఉండే అశోకా మాటి కుటుంబానికి 24 ఎకరాల భూమి ఉంది. వివిధ వనరుల నుంచి నీటిని సేకరించి బిందుసేద్యం పద్ధతిలో ఇన్నాళ్లు వ్యవసాయం చేశారు. గత 20 ఏళ్లలో 150 బోర్లు వేశారు. ఒక్కసారీ చుక్క నీరు బయటకు రాలేదు.
అయినప్పటికీ పట్టు వదలకుండా మళ్లీ ప్రయత్నించాడు అశోకా. గత సోమవారం రాత్రి బోరు వేయగా.. 50 అడుగుల లోతులోనే నీరు ఉబికి వచ్చింది. ఇన్నాళ్లకు తమ పొలంలో పుష్కలంగా నీరు అందుబాటులోకి రావడంపై అశోకా సహా కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నీటి కోసం 30 ఏళ్ల పాటు కాలువ తవ్విన భగీరథుడు