రైతుల పట్ల హరియాణా సర్కారు తీరును నిరసిస్తూ.. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు పంజాబ్ యువజన కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో.. ఆయన నివాసానికి 3 కిలోమీటర్ల దూరంలో చండీగఢ్ పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను ఉంచారు. అయినప్పటికీ.. కొందరు ఆందోళనకారులు బారికేడ్లను దాటి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: వంట గ్యాస్ మంట- భారీగా పెరిగిన ధర
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' నిరసన ప్రదర్శనను హరియాణా ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీగా వెళ్తోన్న తమపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారని.. అందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆగని నిరసనలు..
ప్రస్తుతం వేలాది రైతులు దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఘాజీపుర్-గాజియాబాద్ సరిహద్దు వద్ద పాగా వేసిన రైతన్నలు.. ఓవైపు నిరసనలు సాగిస్తూనే మరోవైపు వంటలు చేసుకుంటున్నారు. రోడ్ల మీద వరుసలో కూర్చొని సహచరులకు వడ్డిస్తున్నారు.
మంగళవారం చర్చలో భాగంగా.. మంత్రుల బృందం కోరినట్లుగా నూతన వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలను రైతు సంఘాలు నేడు రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. వీటిని పరిశీలించిన అనంతరం కేంద్రం డిసెంబర్ 3న మరోసారి చర్చలు జరపనుంది.
ఇదీ చూడండి: పట్టు వీడని రైతన్న- రేపు కేంద్రంతో మరోసారి భేటీ