ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భౌతిక దూరం నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోగ్య నిపుణలు, ఐసీఎంఆర్ సలహాదారు డా.సునీలా గార్గ్ పేర్కొన్నారు.
"కొవిడ్ టీకా తీసుకోవడం ఆరంభించినప్పటి నుంచి ప్రజలు భౌతిక దూరం, మాస్కు నిబంధనలను పట్టించుకోవడం లేదు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆంక్షలు పాటించడం తప్పనిసరి. నిబంధనలను పాటించకపోవడం ప్రజల సాధారణ అలవాటు. అందువల్లే వైరస్ కేసులు పెరుగుతున్నాయి. బిహార్ ఎన్నికల వేళ ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే అవి ఎంత మంది పాటించారన్నదే అసలు సమస్య. పోలింగ్ స్టేషన్ల నిర్వహణపై మార్గదర్శకాలు ఉన్నా వాటిని అమలు చేయడం ముఖ్యం. ఎన్నికల అధికారులు, పరిశీలకులు ఎక్కువ మంది ప్రజలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వారికి తొలుత వ్యాక్సిన్ అందించాలి."
-డా.సునీలా గార్గ్, ఐసీఎంఆర్ సలహాదారు
పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్ కేసులను తీవ్రంగా పరిగణించాలని గార్గ్ హెచ్చరించారు. ఇటీవల వచ్చే కేసుల్లో ఎక్కవగా లక్షణాలు ఉండటం లేదని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వైరస్ ఉత్పరివర్తనం చెందుతూ ఉంటుందన్న గార్గ్.. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: భగవద్గీత స్ఫూర్తితో టీకా సాయం: మోదీ