ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(up polls 2022) కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. అతిపెద్ద రాష్ట్రంలో అధికారం చేపడితే.. దేశ రాజకీయాలను శాసించే స్థాయి దక్కుతుందని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. 2022లో జరగబోయే ఎన్నికల్లో(UP assembly election 2022) అత్యధిక మెజారిటీతో విజయం సాధించి మరోమారు అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది అధికార భారతీయ జనతా పార్టీ. ఆ దిశగా ప్రచార జోరు పెంచింది.
అధికార భాజపా 300కుపైగా సీట్లు గెలుచుకుని(UP election 2022) మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, యూపీ లఖిమ్‌పుర్ ఖేర్ జిల్లా ఎంపీ అజయ్ మిశ్రా. రాష్ట్రంలోని ప్రతి మతం, కులానికి చెందిన ప్రజలు భాజపాతోనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విభజించు పాలించు అనే సూత్రాన్ని అవలంబిస్తున్నాయని, ఆ పార్టీలు సఫలం కాలేరన్నారు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేక ముఖాముఖిలో కీలక విషయాలు వెల్లడించారు అజయ్ మిశ్రా.
" ప్రస్తుత భాజపా ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయి. 2007 తర్వాత, రాష్ట్రంలో వరుసగా మెజారిటీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత 15 ఏళ్లలో ప్రజలు ఎస్పీ, బీఎస్పీ, భాజపాకు ఓటు వేసి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే.. కొన్ని పార్టీలు ప్రజలకు ఏమీ చేయలేదు. కేవలం కుల, మత రాజకీయాలకే మొగ్గు చూపాయి. "
- అజయ్ మిశ్రా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.
పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు మిశ్రా. నిర్ణయాలు తీసుకోవటం, వాటిని అమలు చేయటంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. మోదీ-షా నాయకత్వం లభించటం దేశానికి గొప్ప అదృష్టమని కొనియాడారు. 2014 కన్నా ముందు దేశం ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదుర్కొందని యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, సరైన నాయకత్వం లేదని ఆరోపించారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టాక సవాళ్లను స్వీకరించి దేశాన్ని ముందుకు నడిపించారని, ఏడేళ్ల తర్వాత మంచి స్థానానికి చేరుకున్నామన్నారు అజయ్ మిశ్రా.
ఎంపీల ప్రవర్తన, పనితీరు, సామర్థ్యం, పార్లమెంట్‌కు హాజరయ్యే తీరును బట్టి ఇచ్చే 'సంసద్ రత్నా' అవార్డును ఇటీవల గెలుచుకున్నారు అజయ్ మిశ్రా. పార్లమెంట్ సమావేశాల్లో 100 శాతం హాజరు సాధించారు.
ఇదీ చూడండి:యువ ఓటర్లపై సీఎం దృష్టి- 'ప్రత్యేక పథక' రచన!