ED Summons Sonia: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో జులై 21న విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి స్పష్టం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ మేరకు తాజాగా సమన్లు జారీ చేసింది ఈడీ.
ఈ కేసులో జూన్ 8నే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్ 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం.. జూన్ 12న ఆస్పత్రిలో చేరారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. దీంతో జూన్ 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో పూర్తిగా కోలుకున్న తర్వాతే హాజరవుతానని ఆమె మరోసారి స్పష్టం చేశారు.
ఇప్పుడు మరోసారి ఈడీ సమన్లు పంపించింది. జులై 21న తమ ఎదుట హాజరుకావాలని వెల్లడించింది. సోనియా తనయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇదే కేసు విషయంలో.. మొత్తం ఐదు రోజుల్లో సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది. సోనియా, రాహుల్ గాంధీని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి.
ఏంటీ కేసు?: కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.
ఇవీ చూడండి: ఆ రూ.50లక్షల కారణంగానే సోనియా, రాహుల్‌కు ఇన్ని చిక్కులు!