Rahul Gandhi National herald case: దేశ రాజధాని దిల్లీలో సోమవారం యుద్ధ వాతావరణం కనిపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరు కాగా.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా హస్తం పార్టీ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టింది. నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. వారిలో వందల మందిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పోలీసులతో తోపులాట/ఘర్షణల్లో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సహా పలువురు నేతలు గాయపడ్డారు.
తమ నాయకులపై పోలీసులు దాడులకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగళూరు, అహ్మదాబాద్, ముంబయి, గువాహటి, జమ్మూ, దేహ్రాదూన్, జైపుర్ సహా దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాల్లోనూ హస్తం పార్టీ ఆందోళనలు చేపట్టింది. కాంగ్రెస్ నిరసన ప్రదర్శలను భాజపా తీవ్రంగా తప్పుపట్టింది. ఈడీపై ఒత్తిడి పెంచేందుకే ఆ పార్టీ బలప్రదర్శనలు చేస్తోందంటూ విమర్శలు గుప్పించింది. మరోవైపు రాహుల్‌పై 10 గంటలకు పైగా ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ.. ఇావాళ మరోసారి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
సోదరి వెంట రాగా..: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో సమన్లు అందుకున్న రాహుల్.. సోమవారం ఉదయం తన నివాసం నుంచి తొలుత అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి, తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా సహా రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వంటి అగ్ర నేతలు తోడు రాగా భారీ వాహనశ్రేణితో ఈడీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. ఆ సమయంలో ప్రియాంక తన సోదరుడి వాహనంలోనే కనిపించారు. మధ్య దిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఈడీ కార్యాలయంలోకి రాహుల్ ఉదయం 11:10 గంటలకు ప్రవేశించారు. తర్వాత దాదాపు 20 నిమిషాలకు అధికారులు ఆయన్ను ప్రశ్నించడం ప్రారంభించారు. మధ్యాహ్నం 2:10 గంటలకు భోజనానికి వెళ్లేందుకు రాహుల్‌ను అనుమతించారు. అనంతరం 3:30 గంటలకు మళ్లీ ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఆపై రాత్రి 11:10 గంటలకు అక్కడి నుంచి బయటకు వచ్చారు.
ఏం ప్రశ్నించారంటే..! : ఈడీలో సహాయ డైరెక్టర్ స్థాయి అధికారి నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. యంగ్ ఇండియన్ కంపెనీ ఏర్పాటు, నేషనల్ హెరాల్డ్ కార్యకలాపాలు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కాంగ్రెస్ ఇచ్చిన రుణం, నేషనల్ హెరాల్డ్‌లో నిధుల అంతర్గత బదిలీ వంటి అంశాలపై అధికారి రాహుల్‌ను విచారణలో ప్రశ్నించినట్లు సమాచారం. భోజన విరామానికి ముందు.. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్-50 కింద రాహుల్ తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ ముందు రాహుల్ విచారణకు హాజరు కావడం ఇదే తొలిసారి.
భోజన విరామంలో తల్లి వద్దకు.. : ఈడీ విచారణకు హాజరైన రాహుల్.. భోజన విరామ సమయంలో ప్రియాంకాగాంధీతో కలిసి తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వద్దకు వెళ్లారు. ఆమెను పరామర్శించారు. కొవిడ్ అనంతర సమస్యలతో సోనియా ఆదివారం దిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
హోరెత్తిన నిరసనలు : రాహుల్ విచారణ నేపథ్యంలో దిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉదయం 9 గంటలకల్లా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడారు. జాతీయ పతాకాలు, పార్టీ జెండాలు చేతబూని.. ‘విప్లవం వర్ధిల్లాలి’, ‘రాహుల్.. మీరు పోరాడండి. మేం మీ వెంటే ఉన్నాం’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, నేతలు సమావేశమై.. ‘సత్యాగ్రహ యాత్ర’ పేరుతో ఈడీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. భానుడి భగభగలను తట్టుకుంటూ.. రాహుల్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఏఐసీసీ కార్యాలయం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఈడీ కార్యాలయం ఉంది. అయితే రాహుల్ విచారణ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ముందుగానే అప్రమత్తమయ్యారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారుల్లో వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించారు. భారీగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆ దారుల్లో నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ)లోని సెక్షన్-144 కింద నిషేధాజ్ఞలు విధించారు. నిరసనలకు అనుమతి నిరాకరించారు. ఆంక్షలను లెక్కచేయకుండా ఈడీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కె.సి.వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌధరీ, భూపేశ్ బఘేల్, అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, జైరాం రమేశ్ తదితర సీనియర్ నాయకులు సహా వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వ్యాన్లు, బస్సుల్లో వారిని తరలించారు. పార్టీ సీనియర్ నాయకులను ప్రియాంకాగాంధీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి కలిశారు.
ఇది అప్రకటిత ఆత్యయిక స్థితి- కాంగ్రెస్ : దిల్లీలో తమ నిరసనలను అడ్డుకోవడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రాత్రి నుంచి తమ పార్టీకి చెందిన వేల మంది కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంది. మోదీ సర్కారు దేశ రాజధానిలో సోమవారం అప్రకటిత ఆత్యయిక స్థితిని విధించిందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా దిల్లీలో ఈ మేరకు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీని చూసి భయపడుతోందని పేర్కొన్నారు. ఈడీ కార్యాలయం వైపు తాము శాంతియుతంగా నిరసనలు చేపడుతుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. గాడ్సే వారసులు మరోసారి గాంధీ, ఆయన వారసులను సవాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము సత్యాగ్రహాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కె.సి.వేణుగోపాల్‌పై తీవ్ర దాడి! : శాంతియుత నిరసనలను అడ్డుకుంటూ పోలీసులు తమ నేతలపై దాడులకు పాల్పడ్డారని సుర్జేవాలా ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఏకంగా హత్యాయత్నం స్థాయిలో దాడి జరిగిందని వ్యాఖ్యానించారు. పోలీసుల దురుసుతనంతో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం, మరో నాయకుడు ప్రమోద్ తివారీలకు పక్కటెముకల్లో వెంట్రుకవాసి మందంతో పగుళ్లు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మాజీ మంత్రితో ప్రవర్తించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. రాజ్యసభ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్‌ను లాఠీలతో తీవ్రంగా చితకబాదారని చెప్పారు. వేణుగోపాల్‌ను పోలీసులు లాక్కెళ్తున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. మరోవైపు- తాము 26 మంది ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేశామని.. వారందరినీ విడుదల చేశామని సోమవారం రాత్రి దిల్లీ పోలీసులు వెల్లడించారు.
ఇలా బయటపడటం అదృష్టమే- చిదంబరం: ‘‘ముగ్గురు బలిష్ఠులైన పోలీసులు మీ మీదకు దూసుకొస్తే.. చిన్న పగులుతో బయటపడటం అదృష్టమే. ఇప్పుడు నా పరిస్థితి అదే. పక్కటెముకలో వెంట్రుకవాసి మందం పగులు వచ్చిందని వైద్యులు చెప్పారు. 10 రోజుల్లో దానంతట అదే నయమవుతుందట. నేను బాగానే ఉన్నాను. రేపు యథావిధిగా విధులకు హాజరవుతాను’’ అని ట్విటర్ వేదికగా చిదంబరం వెల్లడించారు.
ఇదీచదవండి: