Delhi Liquor Case ED : దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఆయన భార్య సీమ సిసోదియాతో పాటు ఇతర నిందితులకు చెందిన రూ.52 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ శుక్రవారం వివరాలు వెల్లడించింది.
ఈడీ అటాచ్ చేసిన మొత్తంలో రూ.11.49 కోట్ల మనీశ్ సిసోదియాకు చెందిన బ్యాంకు బ్యాలెన్సులు, బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెట్కు చెందిన రూ. 16.45 కోట్లతో పాటు ఇతరత్రా కలిపి రూ.44.29 కోట్ల చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు, చరాస్తులు కలిపి అటాచ్ చేసిన మొత్తం విలువ రూ. 52.24 కోట్లకు చేరిందని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.
దీంతోపాటు మనీలాండరింగ్ చట్టం కింద మరో రూ. 7.29 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేయడానికి ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మనీశ్ సిసోదియా, ఆయన భార్య సీమ సిసోదియాకు చెందిన రెండు స్థిరాస్తులు, మరో నిందితుడు రాజేశ్ జోషికి చెందిన ల్యాండ్/ఫ్లాట్, గౌతమ్ మల్హోత్రాకు చెందిన ల్యాండ్/ ఫ్లాట్ ఉన్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. మార్చిలో మనీశ్ సిసోదియాను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇదీ దిల్లీ మద్యం కుంభకోణం కేసు..
దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయంగానూ దుమారం రేపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం దిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీలో అనేక లోటుపాట్లు ఉన్నాయనే ఆరోపణలు రావడం ఇందుకు ప్రధాన కారణం. కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చేలా ఈ నూతన మద్యం విధానం తయారు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదే విషయమై దిల్లీ ప్రధాన కార్యదర్శి ఓ నివేదిక ఇచ్చారు. ఆ సమయంలో అబ్కారీ శాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా మనీశ్ సిసోదియా ఉన్నారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సిఫార్సుతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియా సహా మరికొందరు పేర్లను నిందితులుగా పేర్కొంటూ 2022 ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది. అందులో సిసోదియా ఒకరు.