భారత్-రష్యా వార్షిక సదస్సు ఏర్పాట్లపై సమీక్షే ప్రధాన అజెండాగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు దిల్లీలో విస్తృత చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్ విషయంలో భారత్ వైఖరిని ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సర్గే లేవ్రోకు స్పష్టం చేశారు ఆతిథ్య దేశ విదేశాంగ మంత్రి జైశంకర్.
"ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయి. అణు, అంతరిక్ష, రక్షణ రంగాల్లో దీర్ఘకాల భాగస్వామ్యం గురించి చర్చించాం. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్, చెన్నై-వ్లాదివోస్తాక్ మారిటైమ్ కారిడార్‌పై మాట్లాడాం." అని భేటీ అనంతరం వెల్లడించారు జైశంకర్.
'చైనాతో సైనిక కూటమి లేదు'
రష్యా, చైనా సైనిక కూటమి ఏర్పాటు చేయనున్నాయన్న వార్తలను తోసిపుచ్చారు సెర్గే లేవ్రో. "ఇరు దేశాల శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయాలని నిర్ణయించాం. కానీ ఈ సంబంధాలు సైనిక కూటమిని స్థాపించే దిశగా కొనసాగవు" అని స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 20 వార్షిక సదస్సులు జరిగాయి. గతేడాది జరగాల్సిన భారత్-రష్యా వార్షిక సదస్సు.. కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇదీ చూడండి:- గగన్‌యాన్ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ పూర్తి