e bike fire accident: ఎలక్ట్రిక్ బైక్‌లలో మంటలు చెలరేగుతున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఇటీవల తమిళనాడులో ఈ-బైక్‌లో మంటలు వ్యాపించి ఇద్దరు మరణించారు. ఈ ఘటన మరవకముందే అదే రాష్ట్రంలోని తిరువళ్లూరులో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిపోయింది. ఇంటి ముందు బైక్‌ను నిలిపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Electric scooter fire: నరసింగపురంలో నివసించే దేవరాజ్ అనే రైతు ఇంట్లో ఈ ఘటన జరిగింది. దేవరాజ్ ఈప్లస్టో7జీ అనే ఎలక్ట్రిక్ బైక్‌ను ఏడు నెలల క్రితం కొనుగోలు చేశాడు. రూ.90 వేలకు బైక్‌ను కొన్నాడు. పక్క ఊరికి వెళ్లి వచ్చిన ఆయన.. రోజూలాగే తన బైక్‌ను ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే, మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా స్కూటర్లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన దేవరాజ్ కుమారుడు గట్టిగా కేకలు వేశాడు.


మంటల ధాటికి స్కూటర్ పూర్తిగా కాలిపోయింది. దాంతో పాటు పక్కనే ఉన్న ఓ బైక్ సహా ఇతర పరికరాలు సైతం దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలకు సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలను ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. అయితే, అప్పటికే ప్రధాన ఉపకరణాలన్నీ కాలిపోయాయి. ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, మోటర్ పంపులు సహా రూ.3 లక్షల విలువైన సామగ్రి బూడిదైందని తెలుస్తోంది.


ఇదీ చదవండి: 'ఈ-బైక్'లో మంటలు.. ఊపిరాడక తండ్రీకూతురు మృతి!