Drunk Father Buried Son: మద్యం మత్తులో కన్నబిడ్డ పట్ల రాక్షసుడిలా మారాడు తండ్రి. బాలుడిని తీవ్రంగా కొట్టిన తండ్రి.. ఆ తర్వాత చనిపోయాడని అనుకుని గొయ్యితీసి పూడ్చేశాడు.
ఏమైందంటే..?
ఝార్ఖండ్ ధన్బాద్లోని సుధామ్డిహ్కు చెందిన రాణిదేవి, సోనూ సాహ్ దంపతులు. సోనూ సాహ్ మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఎక్కువ మోతాదులో మద్యం తాగిన సోనూ.. ఇంటికి వచ్చి తన కుమారుడ్ని కొట్టాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన కుమారుడ్ని చూసి చనిపోయాడని నిర్ధరించుకున్నాడు. దామోదర్ నది వద్ద ఉన్న మోహల్బానీ ఘాట్ వద్దకు తీసుకెళ్లాడు. మద్యం మత్తులో బాలుడిని అలాగే ఇసుకలో గొయ్యితీసి పూడ్చేశాడు.
కొద్దిసేపటికే బాలుడ్ని వెతకడం మొదలుపెట్టిన రాణిదేవికి సోనూ.. చిన్నారిని ఘాట్ వైపునకు తీసుకెళ్లడం చూసినట్లు స్థానికులు చెప్పారు. దీంతో పరుగున అక్కడకు వెళ్లింది రాణి. ఘాట్ వద్ద మరో వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సోనూ పూడ్చిన గొయ్యిలోంచి చిన్నారిని బయటకు తీసింది. స్థానికుల సాయంతో బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి బాలుడు సజీవంగానే ఉన్నాడని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత చిన్నారిని తల్లికి అప్పగించారు.
ఈ మేరకు రాణి.. సుధామ్డిహ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని తన ఫిర్యాదులో పేర్కొంది రాణి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం.. ఇసుకలో కప్పి పెట్టి..