వీధి శునకాల ఆకలి తీర్చడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్ ఇందౌర్‌లోని ఓ కుటుంబం స్పెషల్ దాబానే ఏర్పాటు చేసింది. డాగీ దాబా పేరుతో తమ ఇంటినే హోటల్‌గా మార్చి.. ఏడు రూపాయలకే శునకాల ఆహారం విక్రయిస్తోంది. వీధి కుక్కల బాగోగులు చూసే జంతు ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని డాగీ దాబాను ప్రారంభించినట్లు దాని యజమాని బాల్‌రాజ్ చెబుతున్నారు. మేఘ్‌దూత్ నగర్లో నివసంచే బాల్‌రాజ్ కుటుంబానికి జంతువులపై విపరీతమైన ప్రేమ. వాటి కోసం ఏదో ఒకటి చేయాలని భావించి.. ఈ దాబాను ప్రారంభించారు బాల్‌రాజ్. నగరంలో ఎక్కడి నుంచైనా శునకాల ఆహారాన్ని ఆర్డర్ చేసే సదుపాయం కల్పించారు. సొంత వాహనాల్లో ఆహారాన్ని డెలివరీ చేస్తున్నారు.
"దాబాను ఏర్పాటు చేయడానికి రూ.3లక్షలు ఖర్చు అయ్యింది. ఇక్కడ వీటి కోసం బేకరి పదార్థాలు, కేక్‌లను తయారు చేస్తాము. ప్రతిరోజు 500 ప్యాకెట్లను హోమ్ డెలివరీ చేస్తాము. వాటికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాము. వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలు దాబాలో లభిస్తాయి. కస్టమర్ల కోరిక మేరకు శునకాలకు ఆహారాన్ని అందిస్తుంటాం. జూ పనిచేయడం వల్ల వాటికి ఎలాంటి ఆహారాన్ని ఎలా తినిపించాలి అని తెలుసు. వెజిటెబుల్, అన్నం, చికెన్ ఇవన్నీ మీల్లో ఇస్తుంటాం. ఎప్పుడూ చికెన్ పెడుతుంటే శునకాలకు బోర్ కొడుతుంది. కేవలం చికెన్నే తినటం వల్ల అవి అంతగా ఎదగవు. అందుకే అన్నిటినీ కలిపి పెడుతుంటాం."
-బాల్‌రాజ్, డాగీ దాబా యజమాని
కాస్ట్లీ ఆహారం సైతం తమ దాబాలో లభిస్తుందని చెబుతున్నారు బాల్‌రాజ్. ఏడు వందల రూపాయల ఆహారం సైతం అందుబాటులో ఉంటుందని చెప్పారు. శునకాల బాగోగులు చూసుకోవడం కోసం దాబాలో సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. పనుల మీద బయటకు వెళ్లే వ్యక్తులు... తమ పెంపుడు శునకాలను ఇక్కడ వదిలి వెళ్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తున్నారు బాల్‌రాజ్.
ప్రతి రోజూ ఆహార ప్యాకెట్లను మేఘదూత్ గార్డెన్‌కు తీసుకెళ్తుంటారు బాల్‌రాజ్. శునకాల కోసం అక్కడ రూ.7కే ఆహార ప్యాకెట్‌ను విక్రయిస్తుంటారు. వీరు తయారు చేస్తున్న ఆహారం కూడా రుచిగా ఉండటం వల్ల వాటిని వీధి శునకాలు ఎంతో ఇష్టంగా తినేస్తున్నాయి. శునకాల కోసం వెజ్, నాన్‌వెజ్ పదార్థాలతో పాటు బేకరీ పదార్థాలను కూడా తయారు చేస్తున్నారు. అలాగే వాటి పుట్టినరోజు వేడుకలు జరపాలనుకుంటే ప్రత్యేకమైన కేక్‌లను కూడా తయారు చేస్తున్నారు. అయితే కేక్‌ల కోసం ముందస్తుగా ఆర్డర్ చేసుకోవాలి. త్వరలో నగరమంతా శునకాల ఆహారం కోసం ఫుడ్ డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నారు.
ఇవీ చదవండి:
'భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిసింది'.. రాజకీయాలకు సోనియా గుడ్‌బై!
అండమాన్‌పై చైనా బెలూన్లు! అమెరికా కంటే ముందే భారత్‌పై నిఘా.. రాడార్‌కు చిక్కకుండా..