తన తల్లిని కించపరిచారని కంటతడి పెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి డీఎంకే ఎంపీ ఎ.రాజా క్షమాపణలు చెప్పారు. ఆయనను వ్యక్తిగతంగా కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. సీఎం పళనిస్వామి కంటతడి పెట్టడం బాధించిందని రాజా చెప్పారు. ఆయనను వ్యక్తిగతంగా దూషించడం తన ఉద్దేశం కాదని, ఇద్దరి రాజకీయ జీవితాల గురించి మాత్రమే పోల్చి మాట్లాడానని రాజా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు.
ఏమన్నారంటే?
రాజా ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. డీఎంకేలో స్టాలిన్ జిల్లా కార్యదర్శి నుంచి అధ్యక్షుడి వరకు అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. దీని ద్వారా పెళ్లై 9 నెలల తర్వాత సరైన పద్ధతిలో స్టాలిన్ జన్మించారని చెప్పవచ్చన్నారు. అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన పళనిస్వామి.. అకాల శిశువుగా జన్మించారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది.
స్పందించిన సీఎం..
ఈ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి పళనిస్వామి.. గ్రామీణ ప్రాంతంలో జీవనం సాగిస్తూ కన్నుమూసిన తన తల్లిని కించపరుస్తూ మాట్లాడుతున్నారని కంటతడి పెట్టారు. భగవంతుడు వారికి తగిన శిక్ష వేస్తాడని చెన్నైలోని తిరువత్తియూరులో ఎన్నికల ప్రచారం సందర్భంగా పళనిస్వామి ఉద్వేగభరితంగా మాట్లాడారు.
ఈ అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నేర విభాగ పోలీసులు ఎంపీ రాజాపై కేసు నమోదు చేశారు. అటు.. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా గౌరవప్రదమైన విమర్శలు మాత్రమే చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ నేపథ్యంలో సీఎంపై తాను చేసిన వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీ రాజా క్షమాపణ చెప్పారు.
ఇదీ చదవండి: మమతXసువేందు: నందిగ్రామ్‌లో మాటల తూటాలు