Different food for Students: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది కర్ణాటకలోని ఓ పాఠశాల. చామరాజనగర్ జిల్లాలోని గొంగులుపేట తాలూకాలోని హొంగహళ్లి ప్రభుత్వ సీనియర్ ప్రైమరీ పాఠశాలలో.. 'అక్షర దాసోహ జోలిగే' పథకం అమలవుతోంది. గ్రామస్థులు తమ పొలాల్లో పండిన కూరగాయలు, పండ్లను పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కోసం అందిస్తున్నారు. గ్రామస్థులు సరఫరా చేసే వేరుశనగ, పప్పులు, తాజా కూరగాయలతో విద్యార్థులకు ప్రత్యేకమైన ఆహారాన్ని వండి పెడుతున్నారు. పాఠశాలలోనూ సొంతంగా ఆకుకూరలు, కూరగాయలను పండిస్తున్నారు.
కనీసం రెండ్రోజులకోసారి విద్యార్థులకు మిఠాయిలు అందిస్తారు. అంటే నెలకి 15సార్లు స్వీట్లు తింటారు. పాఠశాల మెనూలో పాయసం, రవ్వ లడ్డు, గులాబ్ జామూన్, కొబ్బరి మిఠాయి వంటి ప్రత్యేక వంటకాలు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన పథకానికి ఇంఛార్జిగా వ్యవహరిస్తారు. విద్యార్థులందరి పుట్టినరోజులను పాఠశాలలోనే ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు ప్రత్యేక వంటకాలతో పిల్లలందరికీ మిఠాయిలతో కూడిన భోజనం పెడతారు. పాఠశాలలో భోజనం రుచికరంగా ఉండడం వల్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మరో ఆర్నెళ్ల వరకు ఉచిత రేషన్ పథకం