ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి విమర్శనాస్త్రాలు సంధించారు. తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు దినకరన్ కుట్ర పన్నారని ఆరోపించారు. కానీ, ఆయన కలలు ఎప్పటికీ ఫలించవు అని పేర్కొన్నారు.
నమ్మకత్వంతో, కష్టపడి పని చేసే వారికి పార్టీ అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని పళని స్వామి అన్నారు. ఆ లక్షణాలు ఉన్న కార్యకర్త ఎవరైనా సీఎం పదవిని అధిరోహించగలరని పేర్కొన్నారు. కుటుంబ పాలనను తమ పార్టీ ఎప్పటికీ అంగీకరించదని వ్యాఖ్యానించారు. క్రిష్ణగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
''2017లో నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పుడు సుపరిపాలన అందిస్తున్నాం. అప్పుడు మా ఎమ్మెల్యేలను లోబర్చుకోవాలని కొద్ది మంది ప్రయత్నించారు. ఆ కుట్ర పన్నిందెవరో మీక్కూడా తెలుసు. ఆయనెవరో కాదు టీటీవీ దినకరన్. పదేళ్ల నుంచి ఆయన పార్టీలో లేడు. అమ్మ(జయలలిత) ఆయన పార్టీ సభ్యత్వాన్ని తొలగించారు. కానీ, ఏదోలా మళ్లీ ఆయన తిరిగి వచ్చారు. ఈరోజు అదే పార్టీని కూల్చడానికి ఆయన కుట్రలు పన్నుతున్నారు.''
-పళని స్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి
దినకరన్ ఎన్ని అవతారాలెత్తినా.. ఏఐడీఎంకేను ఆయన కూల్చలేరని పళనిస్వామి విమర్శించారు. అంతకుముందు తిరుపతూర్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పళని స్వామి.. అన్ని మతాల వారికి తమ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:శశికళ రాకతో అన్నాడీఎంకేలో కలవరం!