స్టంట్స్ రారాజు, హెడ్ మ్యాన్‌గా పేరొందిన బిహార్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. 249 కిలోల బైక్‌ను భుజంపై మోస్తూ కేవలం 30 సెకన్లలోనే 100 మీటర్లు పరుగెత్తాడు. దీంతో ధర్మేంద్ర ఈ పరుగు పందెంలో విజేతగా నిలిచాడు.
అసలేం జరిగిందంటే..
2022 డిసెంబర్ 31న త్రిపుర రాజధాని అగర్తలాలో బైక్‌ను మోస్తూ పరుగెత్తెె పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 21 దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. ధర్మేంద్ర 115.45 సీసీ సామర్థ్యం ఉన్న బైక్‌ను భుజాన వేసుకొని పరుగెత్తాడు. ఈ పరుగు పందెంలో ధర్మేంద్ర గెలుపొందాడు. దీంతో వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.
"బైక్‌ను ఎత్తుకుని 100 మీటర్లు పరిగెత్తడం సరదాగా అనిపించింది.. ఇప్పుడు నేను సృష్టించిన రికార్డును బద్దలు కొట్టాలని ప్రపంచం మొత్తానికి ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విషయం గర్వంతో చెప్పడం లేదు. ఇది నా విశ్వాసం, నా పోరాటం. ఈ రికార్డు యువతరానికి నా బహుమతి. అలాగే.. ఈ రికార్డు ద్వారా, యావత్ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా".
--ధర్మేంద్ర కుమార్, హెడ్ మ్యాన్