Devotees Cut Tongue Offered to Devi : సాధారణంగా భక్తులు దేవుళ్లకు.. వస్త్రాలు, బంగారం, విలువైన వస్తువులు కానుకగా చెల్లిస్తారు. కానీ మధ్యప్రదేశ్లోని ఇద్దరు భక్తులు.. తమ నాలుకను కోసి మొక్కులు చెల్లించారు. ఓ మహిళ నాలుక సగం తెగిపోగా.. మరో యువకుడు నాలుక పూర్తిగా తెగిపోయి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.
ఇదీ జరిగింది
ఖర్గోన్ జిల్లాలోని సగుర్ భాగుర్ గ్రామంలో బాగేశ్వరి శక్తిధామ్లో దేవి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ మహిళ.. కత్తితో తన నాలుకను కోసుకుని కానుకగా ఇచ్చింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై.. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి చేరింది. మహిళ నాలుక కోసుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న భక్తులు.. ఆమెను ఆపకుండా తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ నాలుక పూర్తిగా తెగిపోలేదని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు.
పూర్తిగా తెగిన నాలుక..
మరోవైపు మొరేనాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మాతా బసౌయాలోని కాళీ మందిరంలో నాలుకను కోసుకున్నాడు ఓ యువకుడు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లాడు. గంటతో పాటు వస్త్రాలు దేవతకు సమర్పించేందుకు తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులతో ఆలయంలో పూజలు చేసిన యువకుడు.. నాలుకను పూర్తిగా కోసుకుని అమ్మవారికి కానుకగా సమర్పించాడు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నాలుకను అమ్మవారికి సమర్పిస్తానని తమ కుమారుడు ఎప్పుడూ చెబుతుండేవాడని అతడి తండ్రి చెప్పాడు. అందువల్లే సోమవారం ఆలయంలో చెప్పినా.. తాము అతడిని పట్టించుకోలేదని తెలిపాడు.
"కాళీ మాత మందిరంలో ఓ యువకుడు నాలుక కోసుకుని అమ్మవారికి సమర్పించాడు. రక్తస్రావమైన అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అతడి నాలుకు పూర్తిగా తెగిపోవడం వల్ల.. మాట్లాడే పరిస్థితిలో లేడు."
--యోగేంద్ర, ఏఎస్ఐ