army youth runs 300 km: ఆర్మీలో చేరాలని ఎంతో మంది యువకులు కలలు కంటుంటారు. రిక్రూట్మెంట్ ఎప్పుడు మొదలవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే, కరోనా కారణంగా.. గడిచిన రెండేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఈ ఉద్యోగానికి సిద్ధమవుతున్న సురేశ్ భీంచర్ అనే ఓ అభ్యర్థి.. వినూత్నంగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. చేతిలో జాతీయ పతాకాన్ని పట్టుకొని.. రోడ్ల వెంట పరిగెత్తాడు. 50 గంటల్లో 350 కిలోమీటర్లు పూర్తి చేశాడు. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన సురేశ్.. మార్చి 29న రాత్రి 9 గంటలకు జిల్లా స్టేడియం నుంచి తన పరుగు ప్రారంభించాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బైఠాయించిన యువకులను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి ఏప్రిల్ 2న దిల్లీకి చేరుకున్నాడు.
"ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నా పరుగు ప్రారంభించేవాడిని. ఉదయం 11 గంటల సమయంలో.. కనిపించిన పెట్రోల్ బంక్ వద్ద ఆగేవాడిని. ఒక్కరోజు మాత్రమే నేను హోటల్లో భోజనం చేశా. తర్వాత నా గురించి తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు.. నాకు భోజనం ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు యువతలో స్ఫూర్తి నింపడానికి నేను ఇలా పరిగెడుతున్నాను."
-సురేశ్ భీంచర్
ఎప్పటి నుంచో భారత ఆర్మీలో చేరాలని సురేశ్ కలలు కంటున్నాడు. 2015 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2018లో నాగౌర్‌లో నిర్వహించిన రిక్రూట్మెంట్ ర్యాలీలో రికార్డు సృష్టించాడు. నాలుగు నిమిషాల 4 సెకన్లలో 1600 మీటర్లు పరిగెత్తి ఔరా అనిపించాడు. అయితే, కొన్ని కారణాల వల్ల ఉద్యోగం సంపాదించలేకపోయాడు. ఇటీవల రిక్రూట్మెంట్లు నిలిచిపోయిన నేపథ్యంలో దిల్లీకి చేరుకున్న సురేశ్.. జంతర్‌మంతర్‌లో ఆందోళన చేస్తున్న యువకులతో కలిసి నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్‌ను కలిశాడు. ఎంపీకి మెమోరాండం సమర్పించాడు. అభ్యర్థుల డిమాండ్లను తాను లోక్‌సభలో లేవనెత్తుతానని బెనివాల్ హామీ ఇచ్చారు.
Army recruitment protests: చాలా రోజుల నుంచి ఇంటికి దూరంగా ఉంటూ తాము చదువుకుంటున్నామని జంతర్‌మంతర్ వద్ద బైఠాయించిన యువకులు చెబుతున్నారు. ఖర్చులన్నీ తమ కుటుంబ సభ్యులే భరిస్తున్నారని, రిక్రూట్మెంట్పై సమాచారం లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కావడం లేదని తరుణ్ అనే యువకుడు చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: ఆడపిల్ల పుట్టిందని సంబరం.. హెలికాప్టర్లో ఇంటికి..