కాలుష్య భూతం కోరలు చాస్తున్న దిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని పేర్కొంది. ఈ పరిస్థితి మరో 24 గంటలు కొనసాగితే కోల్డ్ వేవ్(శీతల గాలులు వీయడం) పరిస్థితిని ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
గత నాలుగైదు సంవత్సరాలతో పోలిస్తే ఈ నవంబర్ నెల అత్యంత చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శీతల ప్రదేశాలైన హిమాచల్‌లోని డల్హౌసీ(10.9 డిగ్రీలు), ధర్మశాల(10.6), మండీ(10.2), ఉత్తరాఖండ్‌లోని మసూరి(10.4)లతో పోలిస్తే దిల్లీలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు స్పష్టం చేసింది.
వచ్చే మూడు నాలుగు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త అంచనా వేశారు. ఆకాశంలో దట్టమైన మేఘాలు లేకపోవడం కూడా అధిక చలికి కారణమని తెలిపారు. హిమాచల్‌లో మంచు కురుస్తున్నందున.. అక్కడి శీతల పవనాలు వీయడం కూడా దిల్లీలో ఉష్ణోగ్రత స్థాయి పడిపోయేందుకు కారణమైందని చెప్పారు.
మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వరుసగా రెండు రోజుల పాటు 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పడిపోతే 'కోల్డ్ వేవ్'గా ప్రకటిస్తుంది ఐఎండీ. నవంబర్ తొలి వారంలో దిల్లీలో సాధారణంగా 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
క్షీణించిన వాయు నాణ్యత
రాజధానిపై కాలుష్య రక్కసి పంజా విసురుతోంది. భారీ గాలులు వీయడం వల్ల దిల్లీలో సోమవారం కాస్త మెరుగుపడిన వాయు నాణ్యత మళ్లీ స్థాయి తీవ్ర స్థాయికి క్షీణించింది. రాత్రి నిశ్చల పరిస్థితుల మధ్య కాలుష్యం పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 10 గంటలకు వాయు నాణ్యత సూచీ 332గా నమోదైంది. 24 గంటల సగటు తీసుకుంటే ఈ సంఖ్య 293గా ఉంది. ఇది తీవ్రమైన విభాగంలోకి వస్తుంది.
మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పంట వ్యర్థాల దహనం జరిగినట్లు గుర్తించామని 'దిల్లీ వాయు నాణ్యత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ' తెలిపింది. ఈ ప్రభావంతో మంగళవారం, బుధవారం రాజధానిలో గాలి నాణ్యత మరింత క్షీణిస్తుందని హెచ్చరించింది.
పర్యావరణ హితం.. 'హరితం'
దీపావళి పండగ నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి హరిత టపాసులను మాత్రమే ఉపయోగించేలా చర్యలు చేపట్టనున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. 2018 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తయారీ నుంచి విక్రయాల వరకు హరిత టపాసులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది.
దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నిబంధనల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యే టపాసులు కాల్చేందుకు అనుమతి ఉంటుంది. నవంబర్ 7 నుంచి 30 మధ్య సాధారణ టపాసుల విక్రయాలను నిషేధించాలని కేంద్రం సహా దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇదివరకే నోటీసులు జారీ చేసింది.